Luke 18

Simulan ang kabanatang ito gamit ang AI

Magtanong sa AI tungkol sa kabanatang ito

Manatili sa teksto at magtanong tungkol sa kilusan, tensyon, background, at kung ano ang inihahayag ng kabanatang ito sa loob ng mas malaking aklat.

1 తన శిష్యులు నిరుత్సాహపడకుండా ఎల్ల వేళలా ప్రార్థన చేస్తూ ఉండాలనడానికి ఆయన వారికి ఈ ఉపమానం చెప్పాడు. 2 “ఒక పట్టణంలో ఒక న్యాయాధిపతి ఉన్నాడు. అతనికి దేవుడంటే భయం లేదు, మనుషులంటే లెక్కలేదు. 3 ఆ పట్టణంలో ఒక విధవరాలు కూడా ఉంది. ఆమె అతని దగ్గరికి తరచుగా వచ్చి ‘నా ప్రతివాదితో వివాదం విషయంలో నాకు న్యాయం చెయ్యి’ అని అడుగుతూ ఉండేది. 4 అతడు ఆమెకు న్యాయం చేయడానికి చాలాకాలం వరకూ ఇష్టపడలేదు. కాని ఆ తరువాత ఇలా అనుకున్నాడు, ‘నేను దేవుడికి భయపడను, మనుషులనూ లెక్కచెయ్యను. 5 కానీ ఈ విధవరాలు నన్ను ఒకటే విసిగిస్తూ ఉంది. కాబట్టి ఆమె మాటిమాటికీ వచ్చి నన్ను సతాయించకుండా ఆమెకి న్యాయం జరిగిస్తాను’ అనుకున్నాడు.” 6 ఇంకా ప్రభువు ఇలా అన్నాడు, “అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట విన్నారు కదా! 7 తాను ఏర్పరచుకున్న వారు రాత్రింబగళ్ళు తనకు విజ్ఞాపనలు చేస్తూ ఉంటే దేవుడు వారికి న్యాయం తీర్చడా? వారి విషయమై ఆయన ఆలస్యం చేస్తాడా? 8 ఆయన వారికి త్వరగానే న్యాయం జరిగిస్తాడు. అయినా మనుష్య కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసం అనేది ఆయనకు కనిపిస్తుందా?” 9 తామే నీతిమంతులని, తమపైనే నమ్మకం పెట్టుకుని ఇతరులను చిన్న చూపు చూసే వారితో ఆయన ఒక ఉపమానం చెప్పాడు. 10 “ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేయడానికి దేవాలయానికి వెళ్ళారు. వారిలో ఒకడు పరిసయ్యుడు. ఇంకొకడు పన్నులు వసూలు చేసే వాడు. 11 పరిసయ్యుడు నిలబడి, ‘దేవా, నేను దొంగలూ, అన్యాయం చేసేవారూ, వ్యభిచారులూ అయిన ఇతరుల్లా కాకుండా, ఇంకా ఈ పన్నులు వసూలు చేసే వాడిలా కాకుండా ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. 12 వారానికి రెండుసార్లు ఉపవాసం ఉంటున్నాను. నా సంపాదన అంతటిలో పదవ వంతు నీకిస్తున్నాను’ అంటూ తనలో తాను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 13 అయితే పన్నులు వసూలు చేసేవాడు దూరంగా నిలబడ్డాడు. కళ్ళు పైకెత్తి చూడడానికి కూడా వాడికి ధైర్యం చాలలేదు. వాడు గుండెలు బాదుకుంటూ, ‘దేవా, నేను పాపిని. నన్ను కరుణించు’ అన్నాడు. 14 పరిసయ్యుడి కంటే పన్నులు వసూలు చేసే వాణ్ణే దేవుడు నీతిమంతుడిగా ఎంచాడు. ఇతడు నిర్దోషిగా ఇంటికి తిరిగి వెళ్ళాడని మీతో చెబుతున్నాను. తనను తాను హెచ్చించుకొనే వాణ్ణి తగ్గించడం, తగ్గించుకొనే వాణ్ణి గొప్పచేయడం జరుగుతుంది. 15 తమ పసి పాపల మీద యేసు తన చేతులుంచాలని కొందరు వారిని ఆయన దగ్గరికి తీసుకువచ్చారు. ఆయన శిష్యులు అది చూసి ఆ తీసుకువచ్చిన వారిని అదిలించారు. 16 అయితే యేసు వారిని తన దగ్గరికి పిలిపించాడు. “పిల్లలను నా దగ్గరికి రానివ్వండి. వారిని ఆటంకపెట్టవద్దు. ఎందుకంటే దేవుని రాజ్యం ఇలాటి వారిదే. 17 చిన్న పిల్లల్లాగా దేవుని రాజ్యాన్ని స్వీకరించని వాడు దానిలో ఎంత మాత్రమూ ప్రవేశించడని మీతో కచ్చితంగా చెబుతున్నాను” అన్నాడు. 18 ఒక అధికారి ఆయనను చూసి, “మంచి ఉపదేశకా, నిత్య జీవానికి వారసుణ్ణి కావాలంటే నేనేం చేయాలి?” అని అడిగాడు. 19 అందుకు యేసు, “నన్ను మంచివాడని ఎందుకంటున్నావు? దేవుడు తప్పించి ఇంకెవరూ మంచి వారు కారు. 20 వ్యభిచారం చేయవద్దు, హత్య చేయవద్దు, దొంగతనం చేయవద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పవద్దు, నీ తండ్రినీ, తల్లినీ గౌరవించు అనే ఆజ్ఞలు నీకు తెలుసు కదా” అని అతనితో అన్నాడు. 21 దానికి జవాబుగా అతడు, “వీటిని చిన్నప్పటి నుండి పాటిస్తూనే ఉన్నాను” అన్నాడు. 22 యేసు అతని మాట విని ఇలా అన్నాడు, “నీకు ఇంకా ఒక్కటి కొదువగా ఉంది. నీ ఆస్తులన్నీ అమ్మి నిరుపేదలకివ్వు. అప్పుడు పరలోకంలో నీకు సంపదలు కలుగుతాయి. ఆపైన నువ్వు వచ్చి నన్ను అనుసరించు” అన్నాడు. 23 అయితే అతడు ఎంతో ధనవంతుడు కాబట్టి ఈ మాటలు విని చాలా విచారపడ్డాడు. 24 యేసు అతన్ని చూసి, “ఆస్తిపాస్తులున్న వారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో కష్టం. 25 ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒక ఒంటె సూది రంధ్రం గుండా వెళ్ళడం తేలిక” అన్నాడు. 26 ఇది విన్న వారు, “అలాగైతే ఎవరు రక్షణ పొందగలరు?” అని అడిగారు 27 అందుకు ఆయన, “మనుష్యులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యమే” అని చెప్పాడు. 28 అప్పుడు పేతురు ఇలా అన్నాడు, “చూడు, మేము అన్నీ వదులుకుని నిన్ను అనుసరించాం.” 29 అందుకు ఆయన, “దేవుని రాజ్యం కోసం ఎవరైనా తన ఇంటినైనా, భార్య నైనా, అన్నదమ్ములనైనా, తల్లిదండ్రులనైనా, పిల్లలనైనా వదులుకుంటే అతనికి, 30 ఈ లోకంలో ఎన్నో రెట్లు, రాబోయే లోకంలో నిత్య జీవం కలుగుతాయని మీకు కచ్చితంగా చెబుతున్నాను” అన్నాడు. 31 ఆయన తన పన్నెండు మంది శిష్యులను ఓ పక్కకు పిలిచి, “వినండి, మనం యెరూషలేము వెళ్తున్నాం. ప్రవక్తలు మనుష్య కుమారుణ్ణి గురించి రాసిన మాటలన్నీ జరుగుతాయి. 32 ఆయనను యూదేతరులకు పట్టిస్తారు. వారేమో ఆయనను ఎగతాళి చేస్తారు, అవమానిస్తారు, ఆయన మీద ఉమ్మి వేస్తారు. 33 ఆయనను కొరడాలతో కొడతారు, చంపివేస్తారు. కానీ మూడవ రోజున ఆయన తిరిగి లేస్తాడు” అని చెప్పాడు. 34 వారికి ఈ మాటల్లో ఒక్కటి కూడా అర్థం కాలేదు. ఈ సంగతి వారికి మర్మంగా ఉంది. కాబట్టి ఆయన చెప్పిన సంగతులు వారికి అంతు బట్టలేదు. 35 ఆయన యెరికో పట్టణం సమీపానికి వచ్చినప్పుడు దారి పక్కనే ఒక గుడ్డివాడు కూర్చుని అడుక్కుంటూ ఉన్నాడు. 36 పెద్ద సంఖ్యలో జనం వెళ్తున్నట్టు అతడు పసిగట్టి, “ఏం జరుగుతోంది?” అని అడిగాడు. 37 నజరేతు వాడైన యేసు వెళ్తున్నాడని వారు అతనికి చెప్పారు. 38 అప్పుడు వాడు, “యేసూ, దావీదు కుమారా, నన్ను కరుణించు” అని కేకలు వేయడం మొదలు పెట్టాడు. 39 ముందు నడుస్తున్నవారు, “నోరు మూసుకో” అని గద్దించారు. కానీ వాడు, “యేసూ, దావీదు కుమారా, నన్ను కరుణించు” అని మరింత బిగ్గరగా కేకలు వేశాడు. 40 అప్పుడు యేసు నిలబడి, వాణ్ణి తన దగ్గరికి తీసుకురమ్మన్నాడు. 41 వాడు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన, “నీ కోసం నేనేంచేయాలని కోరుతున్నావు?” అని అడిగాడు. దానికి వాడు, “ప్రభూ, నాకు చూపు కావాలి” అన్నాడు. 42 దానికి యేసు, “చూపు పొందు, నీ విశ్వాసం నిన్ను బాగు చేసింది” అని వాడితో చెప్పాడు. 43 వెంటనే వాడు చూపు పొందాడు. దేవుణ్ణి కీర్తిస్తూ యేసు వెనకాలే వెళ్ళాడు. ప్రజలంతా ఇది చూసి దేవుణ్ణి స్తుతించారు.

Gawing tunay na pag-aaral ang pagbabasa

Mag-sign up para mag-bookmark ng mga talata, gumawa ng tala, at mag-aral gamit ang AI tools.

Piliin ang susunod mong hakbang pagkatapos ng kabanatang ito Magpatuloy sa pagbabasa, pumili ng plano, o magpatuloy sa pag-aaral gamit ang AI.
Sundin ang mga temang binubuksan ng kabanatang ito Mga kaugnay na topic hub para sa mas malalaking tanong na maaaring nabuksan ng kabanatang ito.