Numbers 16

Start this chapter with AI

Ask AI

Stay in the text and ask about the movement, tension, background, and what this chapter reveals inside the larger book.

1 లేవీ మునిమనవడు, కహాతు మనవడు, ఇస్హారు కొడుకు కోరహు, రూబేనీయుల్లో ఏలీయాబు కొడుకులు దాతాను, అబీరాము, పేలెతు కొడుకు ఓనుతో కలిసి 2 ఇశ్రాయేలీయుల్లో పేరు పొందిన 250 మంది నాయకులతో సహా మోషే మీద తిరుగుబాటుగా లేచి 3 మోషే అహరోనులకు విరోధంగా సమకూడారు. “మీరు చాలా ఎక్కువ అధికారం చలాయిస్తున్నారు. ఈ సమాజంలో ఉన్న వారిందరూ పవిత్రులే. అందరూ యెహోవా కోసం ప్రత్యేకించిన వారే. యెహోవా వారి మధ్య ఉన్నాడు. యెహోవా సమాజం మీద మిమ్మల్ని మీరు ఎందుకు గొప్ప చేసుకుంటున్నారు?” అన్నారు. 4 మోషే ఆ మాట విన్నప్పుడు, సాగిలపడ్డాడు. ఆ తరువాత అతడు కోరహుతో, అతని గుంపుతో, 5 “ఆయన వారు ఎవరో యెహోవా కోసం ప్రత్యేకించిన వారెవరో రేపు యెహోవా తెలియజేసి అతన్ని తన సన్నిధికి రానిస్తాడు. ఆయన తాను ఏర్పరచుకున్నవాణ్ణి తన దగ్గరికి చేర్చుకుంటాడు. 6 కోరహు, నువ్వూ నీ గుంపూ ఇలా చెయ్యండి, మీరు ధూపార్తులు తీసుకుని వాటిలో నిప్పు ఉంచి రేపు యెహోవా సన్నిధిలో వాటి మీద ధూపసాంబ్రాణి వెయ్యండి. 7 అప్పుడు యెహోవా ఎవరిని ఏర్పాటు చేసుకుంటాడో అతనే పవిత్రుడు. లేవీ కొడుకులారా, మీరు చాలా దూరం వెళ్ళారు” అన్నాడు. 8 ఇంకా మోషే కోరహుతో “లేవీ కొడుకులారా వినండి, 9 తన మందిరసేవ చెయ్యడానికి యెహోవా మిమ్మల్ని తన దగ్గరికి చేర్చుకోవడం చిన్న విషయమా? మీరు సమాజం ఎదుట నిలబడి వారు చెయ్యవలసిన సేవ చేసేలా ఇశ్రాయేలీయుల దేవుడు ఇశ్రాయేలీయుల సమాజంలోనుంచి మిమ్మల్ని ప్రత్యేక పరచుకోవడం మీకు తక్కువగా కనిపిస్తున్నదా? 10 ఆయన నిన్నూ, నీతో లేవీయులైన నీ గోత్రం వారిందర్నీ చేర్చుకున్నాడు గదా. ఇప్పుడు మీరు యాజకత్వం కూడా కోరుతున్నారు. 11 దీని కోసం నువ్వూ, నీ గుంపూ యెహోవాకు విరోధంగా పోగయ్యారు. మీరు అహరోనును ఎందుకు విమర్శిస్తున్నారు? అతడు కేవలం యెహోవాకు లోబడినవాడు” అన్నాడు. 12 మోషే అప్పుడు ఏలీయాబు కొడుకులు దాతాను అబీరాములను పిలిపించాడు. 13 కాని వారు “మేము రాము, ఈ అరణ్యంలో మమ్మల్ని చంపాలని పాలు తేనెలు ప్రవహించే దేశంలో నుంచి మమ్మల్ని తీసుకు రావడం చాలదనట్టు, మామీద ప్రభుత్వం చెయ్యడానికి నీకు అధికారం కావాలా? 14 అంతేకాదు, నువ్వు పాలు తేనెలు ప్రవహించే దేశం లోకి మమ్మల్ని తీసుకు రాలేదు. పొలాలు, ద్రాక్షతోటలు ఉన్న స్వాస్థ్యం మాకివ్వలేదు. మమ్మల్ని శుష్క ప్రియాలతో గుడ్డివారుగా చేస్తావా? మేము రాము” అన్నారు. 15 అందుకు మోషే పట్టరాని కోపంతో, యెహోవాకు చెప్తూ “నువ్వు వారి నైవేద్యాన్ని గుర్తించ వద్దు. ఒక్క గాడిదనైనా నేను వారి దగ్గర తీసుకోలేదు. వారిలో ఎవరికీ నేను హాని చెయ్యలేదు” అన్నాడు. 16 అప్పుడు మోషే కోరహుతో “నువ్వూ, నీ గుంపూ, అంటే నువ్వూ, నీ వారూ, అహరోను, రేపు యెహోవా సన్నిధిలో నిలబడాలి. 17 మీలో ప్రతివాడూ తన ధూపార్తిని తీసుకుని వాటి మీద ధూప సాంబ్రాణి వేసి, ఒక్కొక్కడు తన ధూపార్తిని పట్టుకుని 250 ధూపార్తులను యెహోవా సన్నిధికి తేవాలి. నువ్వూ, అహరోను ఒక్కొక్కడు తన ధూపార్తిని తేవాలి” అని చెప్పాడు. 18 కాబట్టి వారిల్లో ప్రతివాడూ తన ధూపార్తిని తీసుకుని వాటిలో నిప్పు ఉంచి వాటి మీద ధూప సాంబ్రాణి వేసినప్పుడు, వారూ, మోషే అహరోనులూ సన్నిధి గుడారం ద్వారం దగ్గర నిలబడ్డారు. 19 కోరహు సన్నిధి గుడారం ద్వారం దగ్గరికి తన సమాజాన్ని వాళ్లకు విరోధంగా పోగు చేసినప్పుడు, యెహోవా మహిమ సమాజమంతటికీ కనిపించింది. 20 అప్పుడు యెహోవా “మీరు ఈ సమాజంలోనుంచి అవతలికి వెళ్ళండి. 21 తక్షణమే నేను వారిని కాల్చేస్తాను” అని మోషే అహరోనులతో చెప్పినప్పుడు, 22 వారు సాగిలపడి “దేవా, సమస్త మానవాళి ఆత్మలకు దేవా, ఈ ఒక్కడు పాపం చేసినందుకు ఈ సమాజం అంతటి మీద నువ్వు కోపం చూపిస్తావా?” అని యెహోవాను వేడుకున్నారు. 23 అప్పుడు యెహోవా మోషేకు జవాబిస్తూ, 24 “సమాజమంతటితో చెప్పు, కోరహు, దాతాను, అబీరాముల గుడారాల చుట్టుపట్ల నుంచి వెళ్ళి పొండి” అన్నాడు. 25 అప్పుడు మోషే లేచి, దాతాను అబీరాముల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇశ్రాయేలీయుల పెద్దలు అతని వెంట వెళ్ళారు. 26 అతడు “ఈ దుష్టుల గుడారాల దగ్గర నుంచి వెళ్ళి పొండి. మీరు వారి పాపాలన్నిట్లో పాలివారై నాశనం కాకుండా ఉండేలా వాళ్లకు కలిగినది ఏదీ ముట్టుకోకండి” అని ఆ సమాజంతో అన్నాడు. 27 కాబట్టి వారు కోరహు, దాతాను, అబీరాముల గుడారాల దగ్గర నుంచి ఇటు అటు లేచి వెళ్ళిపోయారు. దాతాను, అబీరాము, వారి భార్యలు, వారి కొడుకులు, వారి పసిపిల్లలు తమ గుడారాల ద్వారం దగ్గర నిలబడ్డారు. 28 అప్పుడు మోషే “ఈ కార్యాలన్నీ చెయ్యడానికి యెహోవా నన్ను పంపాడనీ, నా అంతట నేనే వాటిని చెయ్యలేదనీ దీనివల్ల మీరు తెలుసుకుంటారు. 29 మనుషులందరికీ వచ్చే చావు లాంటి చావు వీళ్ళకు వస్తే ప్రతి మనిషికీ కలిగేదే వీళ్ళకూ కలిగితే, యెహోవా నన్ను పంపలేదు. 30 కాని, యెహోవా ఒక అద్భుతం చేసి, వారు ప్రాణాలతోనే పాతాళంలోకి కుంగిపోయేలా భూమి తన నోరు తెరచి వారిని, వాళ్లకు కలిగిన సమస్తాన్నీ మింగేస్తే, వారు యెహోవాను అలక్ష్యం చేశారని మీకు తెలుస్తుంది” అన్నాడు. 31 మోషే ఆ మాటలన్నీ చెప్పిన వెంటనే వారి కింద ఉన్న నేల తెరుచుకుంది. 32 భూమి తన నోరు తెరిచి వారిని, వారి కుటుంబాలను, కోరహు సంబంధులందర్నీ, వాళ్లకు చెందిన వాటన్నిటినీ మింగేసింది. 33 వారూ, వారి సంబంధులందరూ ప్రాణాలతో పాతాళంలోకి కుంగిపోయారు. భూమి వారిని మింగేసింది. వారు సమాజంలో ఉండకుండాా నాశనం అయ్యారు. 34 వారి చుట్టూ ఉన్న ఇశ్రాయేలీయులందరూ వారి కేకలు విని “భూమి మనలను కూడా మింగేస్తుందేమో” అనుకుంటూ పారిపోయారు. 35 అప్పుడు యెహోవా దగ్గర నుంచి అగ్ని బయలుదేరి, ధూపార్పణ తెచ్చిన ఆ 250 మందిని కాల్చేసింది. 36 అప్పుడు యెహోవా మోషేతో “నువ్వు యాజకుడైన అహరోను కొడుకు ఎలియాజరుతో చెప్పు, ఆ అగ్ని మధ్యలోనుంచి ఆ ధూపార్తులను ఎత్తు, అవి ప్రతిష్ఠితమైనవి. 37 ఆ నిప్పుని దూరంగా చల్లు. 38 పాపం చేసి తమ ప్రాణాలకు ముప్పు తెచ్చుకున్న వీళ్ళ ధూపార్తులను తీసుకుని బలిపీఠానికి కప్పుగా వెడల్పైన రేకులు చెయ్యాలి. వారు యెహోవా సన్నిధికి వాటిని తెచ్చిన కారణంగా అవి ప్రతిష్ఠితం అయ్యాయి. అవి ఇశ్రాయేలీయులకు గుర్తుగా ఉంటాయి.” 39 అహరోను సంతాన సంబంధి కాని అన్యుడు ఎవరూ యెహోవా సన్నిధిలో ధూపం అర్పించడానికి వచ్చి, 40 కోరహులా, అతని గుంపులా అయపోకుండా ఇశ్రాయేలీయులకు జ్ఞాపికగా ఉండడానికి కాలిపోయినవారు అర్పించిన ఇత్తడి ధూపార్తులను యాజకుడైన ఎలియాజరు తీసి యెహోవా మోషే ద్వారా తనతో చెప్పినట్టు వాటితో బలిపీఠానికి కప్పుగా వెడల్పైన రేకులు చెయ్యించాడు. 41 తరువాత రోజు ఇశ్రాయేలీయుల సమాజమంతా మోషే అహరోనులను విమర్శిస్తూ “మీరు యెహోవా ప్రజలను చంపారు” అని చెప్పి, 42 సమాజమంతా మోషే అహరోనులకు విరోధంగా సమకూడారు. వారు సన్నిధి గుడారం వైపు తిరిగి చూసినప్పుడు, ఆ మేఘం దాన్ని కమ్మింది. యెహోవా మహిమ కూడా కనిపించింది. 43 మోషే అహరోనులు సన్నిధి గుడారం ఎదుటికి వచ్చినప్పుడు, 44 యెహోవా మోషేతో “మీరు ఈ సమాజం మధ్య నుంచి వెళ్ళి పొండి, 45 తక్షణమే నేను వారిని నాశనం చేస్తాను” అని చెప్పినప్పుడు, వారు సాగిలపడ్డారు. 46 అప్పుడు మోషే “నువ్వు ధూపార్తిని తీసుకుని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపం వేసి త్వరగా సమాజం దగ్గరికి వెళ్లి వారి కోసం ప్రాయశ్చిత్తం చెయ్యి, ఎందుకంటే, యెహోవా సన్నిధిలోనుంచి కోపం బయలుదేరింది. తెగులు మొదలయ్యింది” అని అహరోనుతో చెప్పాడు. 47 మోషే చెప్పినట్టు అహరోను వాటిని తీసుకుని సమాజం మధ్యకు పరుగెత్తి వెళ్ళినప్పుడు ప్రజల్లో తెగులు మొదలై పాకిపోతూ ఉంది. కాబట్టి అతడు ధూపం వేసి ఆ ప్రజల కోసం ప్రాయశ్చిత్తం చేశాడు. 48 అతడు చనిపోయిన వారికీ, బతికున్న వారికీ మధ్య నిలబడినప్పుడు తెగులు ఆగింది. 49 కోరహు తిరుగుబాటులో చనిపోయిన వారు కాకుండా 14, 700 మంది ఆ తెగులు వల్ల చనిపోయారు. 50 ఆ తెగులు ఆగినప్పుడు అహరోను సన్నిధి గుడారపు ద్వారం దగ్గర ఉన్న మోషే దగ్గరికి తిరిగి వచ్చాడు.

Turn reading into real study

Sign up to bookmark verses, take notes, and study with AI-powered tools.

Choose your next step after this chapter Keep reading, choose a plan, or keep studying with AI.
Follow the themes this chapter opens Related topic hubs for the larger questions this chapter may have opened.