Leviticus 25

Start this chapter with AI

Ask AI

Stay in the text and ask about the movement, tension, background, and what this chapter reveals inside the larger book.

1 యెహోవా సీనాయికొండ మీద మోషేకు ఇలా చెప్పాడు 2 “నీవు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు. నేను మీకిస్తున్న దేశానికి మీరు వచ్చిన తరువాత ఆ భూమి కూడా యెహోవా పేరట విశ్రాంతి కాలాన్ని పాటించాలి. 3 ఆరు సంవత్సరాలు నీ పొలంలో విత్తనాలు చల్లాలి. ఆరు సంవత్సరాలు నీ పండ్ల తోటను సాగుచేసి దాని పండ్లు సమకూర్చుకోవచ్చు. 4 ఏడవ సంవత్సరం భూమికి మహా విశ్రాంతి కాలం, అంటే అది యెహోవా పేరట విశ్రాంతి సంవత్సరంగా ఉండాలి. ఆ సంవత్సరం నీ పొలంలో విత్తనాలు చల్ల కూడదు. నీ పండ్ల తోటను బాగు చేయకూడదు. 5 బీడుగా వదిలిన చేలో దానంతట అదే పండిన పంట కోత కోసం ఏర్పాట్లు చేసుకోకూడదు. బాగు చేయని నీ చెట్ల పండ్లు ఏరుకోకూడదు. అది భూమికి విశ్రాంతి సంవత్సరం. 6 అప్పుడు భూమి విశ్రాంతి సంవత్సరంలో దానంతట అదే పండిన పంట నీకు, నీ సేవకుడికి, నీ దాసికి, నీ జీతగాడికి, నీతో నివసిస్తున్న పరదేశికి ఆహారంగా ఉంటుంది. 7 నీ పశువులకు, నీ దేశంలోని జంతువులకు దాని పంట అంతా మేతగా ఉంటుంది. 8 ఏడు విశ్రాంతి సంవత్సరాలను, అంటే ఏడేసి సంవత్సరాలను లెక్క బెట్టాలి. ఆ ఏడు విశ్రాంతి సంవత్సరాల కాలం మొత్తం 49 సంవత్సరాలు అవుతుంది. 9 ఏడో నెల పదవ రోజు మీ దేశమంతటా కొమ్ము బూర ఊదాలి. ప్రాయశ్చిత్త దినాన మీ దేశమంతటా ఆ బూర ఊదాలి. 10 మీరు ఆ సంవత్సరాన్ని, అంటే ఏభైయవ సంవత్సరాన్ని పరిశుద్ధ పరచి మీ దేశంలో ఉన్న వారందరికి విడుదల కలిగిందని చాటించాలి. అది మీకు సునాదం. అప్పుడు మీలో ప్రతివాడూ తన ఆస్తిని తిరిగి సొంతం చేసుకోవాలి. ప్రతివాడూ తన కుటుంబానికి తిరిగి రావాలి. 11 ఆ సంవత్సరం, అంటే ఏభైయవ సంవత్సరం మీకు సునాద కాలం. ఆ సంవత్సరంలో మీరు విత్తనాలు చల్ల కూడదు, కోత ఏర్పాట్లు చేసుకోకూడదు. బీడుగా వదిలిన చేలో దానంతట అదే పండిన పంట తినవచ్చు. బాగు చేయని ద్రాక్ష తోటలో పండ్లు ఏరుకోవచ్చు. 12 అది సునాద కాలం. అది మీకు పవిత్రం. చేలో దానంతట అదే పండిన పంటను మీరు తింటారు. 13 ఆ సునాద సంవత్సరం మీలో ప్రతి వాడు తన ఆస్తిని తిరిగి పొందాలి. 14 నీవు నీ పొరుగు వాడికి అమ్మిన దాని విషయంలో గానీ నీ పొరుగు వాడి దగ్గర నీవు కొనుక్కున్న దాని విషయంలో గానీ మీరు ఒకరినొకరు బాధించుకోకూడదు. 15 సునాద సంవత్సరం అయిన తరువాత జరిగిన సంవత్సరాల లెక్క ప్రకారం నీ పొరుగు వాడి దగ్గర నీవు దాన్ని కొనాలి. పంటల లెక్క చొప్పున అతడు నీకు దాన్ని అమ్మాలి. 16 ఆ సంవత్సరాల లెక్క పెరిగిన కొద్దీ దాని వెల పెంచాలి. ఆ సంవత్సరాల లెక్క తగ్గిన కొద్దీ దాని వెల తగ్గించాలి. ఎందుకంటే పంటవచ్చిన సంవత్సరాల లెక్క చొప్పున అతడు దాని ఖరీదు కట్టాలి గదా. 17 మీరు ఒకరి నొకరు బాధించుకో కుండా నీ దేవునికి భయపడాలి. నేను మీ దేవుడైన యెహోవాను. 18 కాబట్టి మీరు నా శాసనాలను నా విధులను పాటించి వాటి ననుసరించి నడుచుకోవాలి. 19 అప్పుడు మీరు ఆ దేశంలో సురక్షితంగా నివసిస్తారు. ఆ భూమి సస్యశ్యామలంగా ఉంటుంది. మీరు తృప్తిగా తిని దానిలో సురక్షితంగా నివసిస్తారు. 20 ఏడవ సంవత్సరంలో మేము ఏమి తింటాము? మేము విత్తనాలు చల్లకూడదు, పంట కూర్చుకోకూడదు గదా అనుకుంటారేమో. 21 నేను ఆరో సంవత్సరం నా దీవెన మీకు కలిగేలా ఆజ్ఞాపిస్తాను. ఆ సంవత్సరం మూడేళ్ళకు సరిపడిన పంట పండుతుంది. 22 మీరు ఎనిమిదో సంవత్సరాన విత్తనాలు చల్లి తొమ్మిదో సంవత్సరం వరకూ పాత పంట తింటారు. కొత్త పంట వచ్చేదాకా పాత దాన్ని తింటారు. 23 భూమిని శాశ్వతంగా వేరొకడికి అమ్మకూడదు. ఎందుకంటే భూమి నాది. మీరు నా దగ్గర తాత్కాలికంగా నివసిస్తున్న పరదేశులు. 24 నీవు కొనుక్కునే ఆస్తి అంతటి విషయంలో విడుదల హక్కును గుర్తించాలి. నీవు ఎవరినుంచి ఆస్తి కొన్నావో ఆ కుటుంబం దాన్ని తిరిగి కొనుక్కునే సదుపాయం కల్పించాలి. 25 నీ సోదరుడు పేదరికం వల్ల తన ఆస్తిలో కొంత అమ్ముకుంటే అతని సమీప బంధువు దాన్ని విడిపించడానికి ఎదుటికి వచ్చి తన సోదరుడు అమ్మినదాన్ని విడిపిస్తాడు. 26 అయితే ఒకడు సమీప బంధువు లేకపోయినా తన ఆస్తిని విడిపించుకోడానికి కావలసిన డబ్బు తానే సంపాదించుకుంటే 27 దాన్ని అమ్మిన సమయం నుండి గడచిన సంవత్సరాలు లెక్కబెట్టాలి. తన ఆస్తి కొనుక్కున్న వాడికి ఆ డబ్బు ఇచ్చి అతడు తన ఆస్తిని దక్కించుకుంటాడు. 28 అతనికి దాని తిరిగి కొనుక్కునేందుకు కావలసిన డబ్బు దొరక్క పోతే అతడు అమ్మిన ఆస్తి సునాద సంవత్సరం వరకూ కొన్న వాడి స్వాధీనంలో ఉండాలి. సునాద సంవత్సరంలో అది విడుదల అవుతుంది. అప్పుడతడు తన ఆస్తిని తిరిగి పొందుతాడు. 29 ఎవరైనా ప్రాకారం ఉన్న ఊరిలోని తన సొంతిల్లు అమ్మితే దాన్ని అమ్మిన రోజు మొదలుకుని సంవత్సరంలోగా దాన్ని విడిపించుకోవచ్చు. ఆ సంవత్సరమంతా దాన్ని విడిపించుకునే అవకాశం అతనికి ఉంది. 30 అయితే ఆ సంవత్సరం నిండే లోగా దాన్ని విడిపించుకోకపోతే ప్రాకారం ఉన్న ఊళ్ళోని ఆ ఇల్లు కొనుక్కున్న వాడికే తరతరాలకు ఉండిపోతుంది. అది సునాద సంవత్సరంలో మొదటి యజమాని ఆధీనంలోకి తిరిగి రాదు. 31 ప్రాకారం లేని గ్రామాల్లోని ఇళ్ళను మాత్రం దేశంలోని పొలాలతో సమానంగా ఎంచాలి. వాటిని తిరిగి విడిపించుకోవచ్చు. అవి సునాదకాలంలో విడుదల అవుతాయి. 32 అయితే లేవీయుల పట్టణాల్లోని ఇళ్ళను వారు ఎప్పుడైనా విడిపించుకోవచ్చు. 33 లేవీయుల పట్టణాల్లోని ఇళ్ళు ఇశ్రాయేలీయుల మధ్య నివసిస్తున్న ఆ లేవీయుల ఆస్తి గనక ఎవరైనా లేవీయుల దగ్గర ఇల్లు కొనుక్కున్నారనుకోండి. అది లేవీయులకు పిత్రార్జితంగా వచ్చిన పట్టణంలో అమ్మిన ఇల్లు. అది సునాద సంవత్సరంలో విడుదల అవుతుంది. 34 లేవీయులు తమ పట్టణ ప్రాంతం భూములను అమ్ముకోకూడదు. అవి వారికి శాశ్వత ఆస్తి. 35 నీ జాతివాడు ఎవరైనా పేదవాడై తనను పోషించుకోలేని స్థితిలో నీ దగ్గరికి వస్తే నీవు ఒక పరదేశికి, నీ దగ్గర నివసిస్తున్న బయటి వ్యక్తికి సహాయం చేసినట్టే అతనికి సహాయం చెయ్యాలి. 36 అతని దగ్గర వడ్డీ తీసుకోకూడదు. అతని వలన లాభం పొందాలని చూడకూడదు. నీ సోదరుడు నీ మూలంగా బ్రతకాలి. ఆ విధంగా నీ దేవుణ్ణి నీవు గౌరవించాలి. 37 డబ్బు ఇచ్చి వడ్డీ తీసుకోకూడదు. నీ దగ్గరున్న ఆహారపదార్థాలను లాభం వేసుకుని అతనికి అమ్మకూడదు. 38 నేను యెహోవాను. మీకు దేవుడుగా ఉండడానికి ఐగుప్తులోనుండి మిమ్మల్ని రప్పించి, మీకు కనాను దేశాన్ని ఇచ్చిన వాణ్ణి. 39 నీ స్వజాతి వాడు పేదవాడై తనను నీకు అమ్మేసుకుంటే వాడిచేత బానిసలా ఊడిగం చేయించుకో కూడదు. 40 వాడు సేవకునిలాగా పరదేశిలాగా నీ దగ్గర ఉండి సునాద సంవత్సరం వరకూ నీ దగ్గర సేవకుడుగా పని చేస్తాడు. 41 అప్పుడతడు తన పూర్వీకుల ఆస్తిని మళ్లీ అనుభవించేలా తన పిల్లలతో సహా నీ దగ్గర నుండి బయలు దేరి తన వంశం వారి దగ్గరికి తిరిగి వెళ్ళాలి. 42 ఎందుకంటే వారు నాకే సేవకులు. నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించాను. బానిసలను అమ్మినట్టు వాళ్ళను అమ్మకూడదు. 43 నీ దేవునికి భయపడి అలాటి వాణ్ణి కఠినంగా చూడకూడదు. 44 మీ చుట్టుపక్కల ఉన్న జాతుల్లోనించి దాస దాసీలను కొనుక్కోవచ్చు. 45 మీ మధ్య నివసించే పరదేశులను నీ దేశంలో వారికి పుట్టిన పరాయి వారిని కొనవచ్చు. వారు మీ ఆస్తి అవుతారు. 46 అలాటి బానిసలను మీ తరవాత మీ సంతానానికి కూడా ఆస్తిగా సంపాదించుకోవచ్చు. వారు శాశ్వతంగా మీకు బానిసలౌతారు. కానీ మీ సోదర ఇశ్రాయేలీయులతో కఠినమైన చాకిరీ చేయించుకోకూడదు. 47 పరదేశిగానీ మీ దగ్గర తాత్కాలికంగా నివసించేవాడు గాని ధనికుడై, నీ సాటి ఇశ్రాయేలీయుల్లో ఒకడు పేదవాడై ఆ పరదేశికైనా ఆ పరదేశి కుటుంబంలో ఎవరికైనా తనను అమ్ముకున్నాడనుకోండి. 48 నీ సాటి ఇశ్రాయేలీయుల్లో ఒకడు అమ్ముడుబోయిన తరువాత అతణ్ణి విడిపించ వచ్చు. అతడి బంధువుల్లో ఎవరైనా అతణ్ణి విడిపించవచ్చు. 49 అతని బాబాయిగాని బాబాయి కొడుకు గాని అతని వంశంలోని రక్తసంబంధిగాని అతణ్ణి విడిపించవచ్చు. అవసరమైన విడుదల వెల అతనికి దొరికితే అతడు తనను తాను విడిపించుకోవచ్చు. 50 అప్పుడు అతడు తనను కొనుక్కున్న వాడితో బేరమాడాలి. తాను అమ్ముడుబోయిన సంవత్సరం నుండి సునాద సంవత్సరం వరకూ సంవత్సరాలు లెక్క బెట్టాలి. తనను కొనుక్కున్న వాడి దగ్గర ఎంతకాలం పనిచేశాడు అనే దాన్ని బట్టి అతని విడుదల వెల లెక్కగట్టాలి. ఆ వెలను జీతానికి పెట్టుకున్న సేవకునికి ఇచ్చే దాని ప్రకారం లెక్కించాలి. 51 సునాద సంవత్సరానికి ఇంకా చాలా సంవత్సరాలు మిగిలి ఉంటే, ఆ సంవత్సరాల లెక్క ప్రకారం తన విడుదల వెల తిరిగి చెల్లించాలి. 52 సునాద సంవత్సరానికి ఇక కొద్ది కాలమే ఉంటే కొన్న వాడితో లెక్క చూసుకుని మిగిలిన సంవత్సరాల లెక్కచొప్పున చెల్లించాలి. 53 సంవత్సరాల లెక్క ప్రకారం జీతంపై పని చేసే వాడి లాగా వాడతని దగ్గర పని చెయ్యాలి. అతని చేత కఠినంగా సేవ చేయించకుండా మీరు చూసుకుంటూ ఉండాలి. 54 అతడు ఈ విధంగా విడుదల పొందకపోతే సునాద సంవత్సరంలో అతడు తన పిల్లలతో సహా విడుదల పొందుతాడు. 55 ఎందుకంటే ఇశ్రాయేలీయులు నాకే దాసులు. నేను ఐగుప్తుదేశంలో నుండి రప్పించిన నా దాసులే. నేను మీ దేవుడైన యెహోవాను.”

Turn reading into real study

Sign up to bookmark verses, take notes, and study with AI-powered tools.

Choose your next step after this chapter Keep reading, choose a plan, or keep studying with AI.
Follow the themes this chapter opens Related topic hubs for the larger questions this chapter may have opened.