Leviticus 13

Start this chapter with AI

Ask AI

Stay in the text and ask about the movement, tension, background, and what this chapter reveals inside the larger book.

1 యెహోవా మోషే అహరోనులకు ఇలా చెప్పాడు. 2 “ఒక వ్యక్తి చర్మం పైన వాపు గానీ, ఎండిన పొక్కు గానీ, నిగనిగలాడే మచ్చ గానీ ఉండి అది చర్మ వ్యాధిగా మారితే అతణ్ణి ప్రధాన యాజకుడైన అహరోను దగ్గరికి గానీ, యాజకులైన అతని కొడుకుల దగ్గరికి గానీ తీసుకు రావాలి. 3 అప్పుడు ఆ యాజకుడు అతని చర్మంపై ఉన్న వ్యాధిని పరీక్ష చేస్తాడు. వ్యాధి మచ్చ ఉన్న ప్రాంతంపైన వెంట్రుకలు తెల్లగా మారి, ఆ మచ్చ చర్మంలో లోతుగా ఉన్నట్టు కన్పిస్తే అది అంటువ్యాధి. యాజకుడు అతణ్ణి పరీక్ష చేసిన తరువాత అతణ్ణి అశుద్ధుడని నిర్థారించాలి. 4 ఒకవేళ నిగనిగలాడే మచ్చ చర్మం పైన తెల్లగా కన్పించి, అది లోతుగా లేకుండా, అక్కడి చర్మం పై వెంట్రుకలు తెల్లగా మారకుండా ఉంటే యాజకుడు ఆ వ్యక్తిని ఏడు రోజులు వేరుగా, ఒంటరిగా ఉంచాలి. 5 ఏడో రోజు యాజకుడు అతణ్ణి తిరిగి పరీక్షించాలి. తన దృష్టిలో వ్యాధి ముదరకుండా, ఆ మచ్చ వ్యాపించకుండా ఉందేమో చూడాలి. ఆ మచ్చ చర్మంపై వ్యాపించకుండా ఉంటే యాజకుడు మరో ఏడు రోజులు అతణ్ణి వేరుగా ఉంచాలి. 6 ఏడో రోజు యాజకుడు అతణ్ణి రెండోసారి పరీక్షించాలి. వ్యాధి తగ్గి ఆ మచ్చ చర్మం పైన వ్యాపించకుండా ఉంటే అతణ్ణి శుద్ధుడని ప్రకటించాలి. అది పొక్కు మాత్రమే. అతడు తన బట్టలు ఉతుక్కోవాలి. అప్పుడు శుద్ధుడుగా ఉంటాడు. 7 అయితే అతడు తన శుద్ధి కోసం యాజకుడికి కన్పించిన తరువాత ఆ మచ్చ చర్మంపైన వ్యాపిస్తే యాజకుడికి మరో సారి కనిపించాలి. 8 అప్పుడు ఆ మచ్చ చర్మం పైన ఇంకా వ్యాపించి ఉంటే యాజకుడు అతణ్ణి అశుద్ధుడని నిర్థారించాలి. 9 ఎవరికైనా చర్మంపైన పొడలా కన్పిస్తే అతణ్ణి యాజకుడి దగ్గరకి తీసుకురావాలి. 10 యాజకుడు ఏదన్నా వాపు చర్మంపైన తెల్లగా కన్పిస్తుందేమో చూడాలి. అక్కడి వెంట్రుకలు తెల్లగా మారి, ఆ వాపు రేగి పుండులా కన్పిస్తుందేమో చూడాలి. 11 ఈ సూచనలు కన్పిస్తే అది తీవ్రమైన చర్మవ్యాధి. యాజకుడు అతణ్ణి అశుద్ధుడని నిర్థారించాలి. అతడు అప్పటికే అశుద్ధుడు కాబట్టి అతణ్ణి వేరుగా ఉంచకూడదు. 12 ఆ చర్మ వ్యాధి మరింత తీవ్రమై ఆ వ్యక్తి తలనుండి కాలి వరకూ వ్యాపిస్తే, అలా యాజకుడికి కూడా అనిపిస్తే, అప్పుడు యాజకుడు వ్యాధి ఆ వ్యక్తి శరీరమంతా వ్యాపించిందేమో పరీక్ష చేయాలి. 13 ఆ చర్మ వ్యాధి అతని శరీరమంతా వ్యాపిస్తే యాజకుడు అతణ్ణి శుద్ధుడని ప్రకటించాలి. ఒళ్ళంతా తెల్లబారితే అతడు శుద్ధుడు. 14 ఒకవేళ అతని ఒంటిపై చర్మం రేగి పుండు అయితే అతడు అశుద్ధుడు. 15 యాజకుడు చర్మంపై పచ్చి పుండు చూసి అతణ్ణి అశుద్ధుడని నిర్థారించాలి. ఎందుకంటే రేగిన చర్మం, పచ్చి పుండు అశుద్ధమే. అది అంటువ్యాధి. 16 అయితే ఒకవేళ ఆ పుండు ఎండిపోయి చర్మం తిరిగి తెల్లగా కన్పిస్తే ఆ వ్యక్తి యాజకుడి దగ్గరికి వెళ్ళాలి. 17 యాజకుడు అతని చర్మం తెల్లగా మారిందేమో చూస్తాడు. అది తెల్లబారితే ఆ వ్యక్తి శుద్ధుడని ప్రకటిస్తాడు. 18 ఒక వ్యక్తి చర్మం పైన పుండు వచ్చి అది మానిపోతే 19 ఆ పుండు ఉన్న ప్రాంతంలో తెల్లని వాపుగానీ, నిగనిగలాడే మచ్చ గానీ, తెలుపుతో కూడిన ఎర్రని మచ్చ గానీ కన్పిస్తే దాన్ని యాజకుడికి చూపించాలి. 20 ఆ మచ్చ చర్మంలో లోతుగా ఉండి ఆ ప్రాంతంలో వెంట్రుకలు తెల్లగా కన్పిస్తున్నాయో లేదో యాజకుడు పరీక్షిస్తాడు. ఒకవేళ అలా ఉంటే అతణ్ణి అశుద్ధుడని ప్రకటించాలి. పుండు ఉన్నచోటే అది కన్పిస్తే అది అంటురోగం. 21 యాజకుడు పరీక్షించినప్పుడు ఆ మచ్చపైన వెంట్రుకలు తెల్లగా మారకుండా, అది చర్మం పైన లోతుగా కాకుండా మానిపోతున్నట్టు కన్పిస్తే అతణ్ణి ఏడు రోజులపాటు వేరుగా, ఒంటరిగా ఉంచాలి. 22 తరువాత అది చర్మం అంతటా వ్యాపిస్తే యాజకుడు అతణ్ణి అశుద్ధుడని నిర్థారించాలి. అది ఒక అంటు వ్యాధి. 23 నిగనిగలాడే మచ్చ అలాగే ఉండిపోయి వ్యాపించకుండా ఉంటే అది పుండు మానిన మచ్చ. యాజకుడు అతణ్ణి శుద్ధుడని ప్రకటించాలి. 24 చర్మంపైన కాలిన గాయమై ఆ కాలిన చోట నిగనిగలాడే తెల్లని మచ్చ కానీ, తెలుపుతో కూడిన ఎర్రని మచ్చగానీ ఉంటే యాజకుడు దాన్ని పరీక్షించాలి. 25 ఆ మచ్చ చర్మంలో లోతుగా ఉండి ఆ ప్రాంతంలో వెంట్రుకలు తెల్లగా కన్పిస్తున్నాయో లేదో యాజకుడు పరీక్షిస్తాడు. అలా ఉంటే అది అంటువ్యాధి. అది కాలిన గాయంలోనుండి బయటకు వచ్చింది. అప్పుడు యాజకుడు ఆ వ్యక్తిని అశుద్ధుడని నిర్థారించాలి. అది అంటువ్యాధి. 26 అయితే యాజకుడు దాన్ని పరీక్షించినప్పుడు నిగనిగలాడే మచ్చలో తెల్లని వెంట్రుకలు లేకపోయినా, మచ్చ లోతుగా లేకుండా గాయం మానినట్టు కన్పిస్తున్నా అతణ్ణి ఏడు రోజులు ఒంటరిగా, వేరుగా ఉంచాలి. 27 ఏడో రోజు యాజకుడు అతణ్ణి పరీక్షించినప్పుడు ఆ వ్యాధి చర్మం అంతా వ్యాపిస్తే అతణ్ణి అశుద్ధుడని నిర్థారించాలి. అది అంటువ్యాధి. 28 అయితే నిగనిగలాడే మచ్చ చర్మం అంతా వ్యాపించకుండా అలాగే ఉండి మానినట్టు కన్పిస్తే అది కాలిన గాయం వల్ల కలిగిన వాపు. యాజకుడు అతణ్ణి శుద్ధుడుగా నిర్థారించాలి. అది కేవలం కాలడం మూలాన కలిగిన మచ్చ మాత్రమే. 29 మగవాళ్ళకైనా, ఆడవాళ్లకైనా తలలో గానీ, గడ్డంలో గానీ ఏదన్నా అంటువ్యాధి వస్తే యాజకుడు దాన్ని పరీక్షించాలి. 30 అది చర్మంలో లోతుగా ఉన్నట్టు కన్పించినా, లేదా దానిపై వెంట్రుకలు పసుపు పచ్చగా మారినా ఆ వ్యక్తిని యాజకుడు అశుద్ధుడనీ, అశుద్ధురాలనీ నిర్థారించాలి. తలలో లేదా గడ్డంలో అది దురద పుట్టించే ఒక అంటువ్యాది. 31 ఏదైనా మచ్చ దురద పుట్టేదిగా ఉన్నప్పుడు యాజకుడు ఆ మచ్చని పరీక్షించాలి. ఆ మచ్చ చర్మంలో లోతుగా లేకపోయినా, దానిపై నల్ల వెంట్రుకలు లేకపోయినా యాజకుడు ఆ దురద మచ్చ వ్యాధి ఉన్న వ్యక్తిని ఏడు రోజుల పాటు ఒంటరిగా, వేరుగా ఉంచాలి. 32 ఏడో రోజు యాజకుడు ఆ మచ్చ వ్యాపించిందేమో చూడాలి. వ్యాధి మచ్చ ఉన్న ప్రాంతంలో పసుపు పచ్చ వెంట్రుకలు లేకపోయినా, ఆ మచ్చ కేవలం చర్మం పైన మాత్రమే కన్పిస్తున్నా అతనికి జుట్టు కత్తిరించాలి. 33 వ్యాధి మచ్చ ఉన్నచోట మాత్రం జుట్టు కత్తిరించకూడదు. యాజకుడు ఆ మచ్చ ఉన్న వ్యక్తిని మరో ఏడు రోజులు ఒంటరిగా, వేరుగా ఉంచాలి. 34 ఏడో రోజు యాజకుడు ఆ మచ్చ వ్యాపించిందేమో చూడాలి. ఆ మచ్చ కేవలం చర్మం పైన మాత్రమే కనిపిస్తూ ఉంటే యాజకుడు అతణ్ణి శుద్ధుడిగా నిర్థారించాలి. ఆ వ్యక్తి తన బట్టలు ఉతుక్కోవాలి. తరువాత అతడు శుద్ధుడు అవుతాడు. 35 ఒకవేళ అతడు శుద్ధుడని నిర్ధారించిన తరువాత ఆ వ్యాధి మచ్చ ఎక్కువగా వ్యాపిస్తే యాజకుడు తిరిగి అతణ్ణి పరీక్షించాలి. 36 ఒకవేళ ఆ వ్యాధి చర్మంపైన వ్యాపిస్తే యాజకుడు పసుపుపచ్చ వెంట్రుకల కోసం వెదకాల్సిన పని లేదు. అతడు అశుద్ధుడే. 37 అయితే ఆ దురద వ్యాధి వ్యాప్తి నిలిచిపోయిందనీ, ఆ వ్యాధి మచ్చలో నల్ల వెంట్రుకలు మొలుస్తున్నాయనీ యాజకుడికి అన్పిస్తే ఆ వ్యాధి నయం అయినట్టే. అతడు శుద్ధుడే. యాజకుడు అతడు శుద్ధుడని నిర్థారించాలి. 38 మగవాళ్ళకైనా, ఆడవాళ్లకైనా చర్మం పైన నిగనిగలాడే తెల్లని మచ్చలు ఏర్పడితే యాజకుడు వాళ్ళని పరీక్షించాలి. 39 ఆ నిగనిగలాడే మచ్చలు అస్పష్టంగా ఉంటే చర్మం లోనుండి వచ్చిన పొక్కు మాత్రమే. వాళ్ళు శుద్ధులే అవుతారు. 40 మగవాడి తల వెంట్రుకలు రాలిపోతే అతనిది బట్టతల. అయినా అతడు శుద్ధుడే. 41 ముఖం వైపు ఉన్న జుట్టు రాలిపోతే అతడిది బోడి నొసలు. అతడు శుద్ధుడే. 42 అయితే ఒక వ్యక్తి బట్టతలపై గానీ, నొసటిపైన గానీ ఎరుపు చాయలో తెల్లని మచ్చ ఏర్పడితే అది అంటువ్యాధి. 43 అతని బట్టతలపై గానీ నొసటిపై గానీ వ్యాధి వచ్చిన ప్రాంతంలో ఏర్పడిన వాపు చర్మంలో అంటువ్యాధిని సూచిస్తుందేమో యాజకుడు పరీక్షించాలి. 44 ఆ వాపు అలా సూచిస్తుంటే అతనికి వచ్చింది అంటువ్యాధి. అతడు అశుద్ధుడు. అతని తలపై ఉన్న వ్యాధి కారణంగా యాజకుడు అతణ్ణి అశుద్ధుడుగా ప్రకటించాలి. 45 ఆ అంటువ్యాధి ఉన్న వ్యక్తి బట్టలను చించివేయాలి. అతడు తన తలని విరబోసుకోవాలి. అతడు తన కింది పెదవిని కప్పుకుని ‘అశుద్ధుణ్ణి! అశుద్ధుణ్ణి!’ అని కేకలు పెట్టాలి. 46 ఆ అంటువ్యాధి ఉన్నన్ని రోజులూ అతడు అశుద్ధుడుగానే ఉంటాడు. అతనికి అంటురోగం వచ్చి అశుద్ధుడుగా ఉన్నాడు కాబట్టి అతడు ఒంటరిగానే ఉండాలి. శిబిరం బయట అతడు నివసించాలి. 47 ఏదైనా బట్టలకు బూజు పడితే అది ఉన్ని అయినా నార బట్టలైనా, 48 లేదా నారతో వెంట్రుకలతో తోలుతో చేసిన పడుగైనా, పేక అయినా, వస్తువైనా 49 వాటిపైన పచ్చని లేదా ఎర్రని మాలిన్యం ఏర్పడి, వ్యాపిస్తే అది బూజు, తెగులు. దాన్ని యాజకుడికి చూపించాలి. 50 యాజకుడు ఆ తెగులు కోసం ఆ వస్తువుని పరీక్షించాలి. ఆ తెగులు పట్టిన దాన్ని ఏడురోజుల పాటు వేరుగా ఉంచాలి. 51 ఏడో రోజు తిరిగి ఆ తెగులు కోసం పరీక్షించాలి. నారతోనో వెంట్రుకలతోనో, తోలుతోనో చేసిన పడుగైనా, పేక అయినా, వస్తువైనా వాటిపైన ఆ తెగులు వ్యాపించినట్టు కన్పిస్తే అది హానికరమైన తెగులు. అది అశుద్ధం. 52 కాబట్టి అతడు నారతోనో వెంట్రుకలతోనో, తోలుతోనో చేసిన పడుగైనా, పేక అయినా, వస్తువైనా హానికరమైన తెగులు కన్పించిన దాన్ని మంట పెట్టి కాల్చేయాలి. ఎందుకంటే అది వ్యాధికి దారితీస్తుంది. దాన్ని సంపూర్ణంగా తగలబెట్టాలి. 53 అయితే యాజకుడు పరీక్షించినప్పుడు నారతో వెంట్రుకలతో, తోలుతో చేసిన పడుగైనా, పేక అయినా, వస్తువైనా వాటిపైన ఆ తెగులు వ్యాపించకపొతే 54 యాజకుడు ఆ తెగులు పట్టిన దాన్ని ఉతకమని ఆజ్ఞాపించాలి. దాన్ని మరో ఏడు రోజులు విడిగా ఉంచాలి. 55 ఆ తరువాత తెగులు పట్టిన ఆ వస్తువుని యాజకుడు పరీక్షించాలి. ఆ తెగులు రంగు మారకపోయినా, వ్యాపించక పోయినా అలాగే ఉంటే అది అశుద్ధం. దాన్ని మంట పెట్టి కాల్చేయాలి. ఆ తెగులు ఎక్కడ పట్టినా, ఆ వస్తువుని సంపూర్ణంగా కాల్చేయాలి. 56 ఒకవేళ ఆ బట్టని ఉతికిన తరువాత యాజకుడు దాన్ని పరీక్షించినప్పుడు ఆ తెగులు అస్పష్టంగా కన్పిస్తే అది బట్టలైనా, పడుగైనా, పేక అయినా, తోలు అయినా దాన్ని యాజకుడు చించివేయాలి. 57 ఆ తరువాత ఆ తెగులు నారతో వెంట్రుకలతో తోలుతో చేసిన పడుగులోనో, పేకలోనో, వస్తువుపైనో, బట్టలపైనో ఇంకా కన్పిస్తే అది వ్యాపిస్తుందని అర్థం. అప్పుడు ఆ తెగులును పూర్తిగా కాల్చేయాలి. 58 నారతోనో వెంట్రుకలతోనో, తోలుతోనో చేసిన పడుగైనా, పేక అయినా, వస్తువైనా, బట్టలైనా ఉతికిన తరువాత తెగులు కన్పించకుంటే ఆ వస్తువునో, బట్టనో రెండోసారి ఉతికించాలి. అప్పుడు అది శుద్ధం అవుతుంది. 59 ఉన్ని బట్టల పైనో, నార బట్టలపైనో, పడుగుపైనో, పేకపైనో తోలు వస్తువులపైనో బూజూ, తెగులూ కన్పించినప్పుడు వాటిని అశుద్ధం అనో శుద్ధం అనో ప్రకటించడానికి ఉద్దేశించిన చట్టం ఇది.”

Turn reading into real study

Sign up to bookmark verses, take notes, and study with AI-powered tools.

Choose your next step after this chapter Keep reading, choose a plan, or keep studying with AI.
Follow the themes this chapter opens Related topic hubs for the larger questions this chapter may have opened.