Job 15

Start this chapter with AI

Ask AI

Stay in the text and ask about the movement, tension, background, and what this chapter reveals inside the larger book.

1 అప్పుడు తేమానీయుడు ఎలీఫజు ఇలా జవాబు ఇచ్చాడు, 2 “జ్ఞానం గలవాడు గాలితో తన కడుపు నింపుకుని తెలివి తక్కువతనంగా వ్యర్ధమైన మాటలు మాట్లాడడం మంచిదేనా? 3 వ్యర్థమైన పదాలు పలకడం వల్ల ప్రయోజనం ఏమిటి? ప్రయోజనం లేని మాటలతో వాదించడం ఎందుకు? 4 అలాంటి మాటలతో నీకున్న భయభక్తులను హీనపరుస్తున్నావు. నీ దేవుని ధ్యానాన్ని ఆటంకపరుస్తున్నావు. 5 నువ్వు మాట్లాడే మాటల వల్ల నీ పాపాలు బయటపడుతున్నాయి. కపటంగా మాట్లాడాలని నువ్వు చూస్తున్నావు. 6 నేను కాదు, నీ మాటలే నువ్వు నేరం చేశావని ప్రకటిస్తున్నాయి. నీకు వ్యతిరేకంగా నీ పెదవులే సాక్ష్యం పలుకుతున్నాయి. 7 మనిషిగా పుట్టిన వాళ్ళలో మొదటివాడివి నువ్వే అనుకుంటున్నావా? కొండలకన్నా నువ్వు ముందుగా ఉన్నావా? 8 నువ్వేమైనా దేవుని సమాలోచన సభలో సభ్యుడివా? నువ్వొక్కడివే జ్ఞానం గలవాడివా? 9 మాకు తెలియని విషయాలు నీకేం తెలుసు? మేము గ్రహించలేని విషయాలు నువ్వేం గ్రహించావు? 10 మాలో తల నెరసిన వృద్ధులు అనేకమంది ఉన్నారు. వాళ్ళు నీ తండ్రి కంటే చాలా పెద్దవాళ్ళు. 11 దేవుడిచ్చిన ఓదార్పు నీకు తేలికగా అనిపిస్తుందా? ఆయన నీతో పలికిన మృదువైన మాటలు నీకు మనసులోకి ఎక్కడం లేదా? 12 నీ హృదయం ఎందుకు క్రుంగిపోయింది? నీ కళ్ళు ఎందుకలా ఎర్రబడ్డాయి? 13 దేవునిపై నీకెందుకు కోపం వస్తుంది? నీ నోట వెంట అలాంటి మాటలు ఎందుకు వెలువడుతున్నాయి? 14 కళంకం లేనివాడు అనిపించుకోడానికి మనిషి ఎంతటివాడు? స్త్రీకి పుట్టినవాడు పవిత్రుడుగా ఎలా ఎంచబడతాడు? 15 ఆలోచించు, దేవుడు తన పవిత్ర దూతలను కూడా నమ్మడు. ఆకాశ విశాలాలు ఆయన దృష్టికి పవిత్రం కావు. 16 అలా ఉండగా, మనుషులు మరింత దుర్మార్గులు. వాళ్ళు నీచులు, దుష్టకార్యాలు చేసేవాళ్ళు, అన్యాయాన్ని నీళ్ళు తాగినట్టు తాగేవాళ్లు. 17 నేను చెప్పేది విను. నేను నీకు సంగతులు చెబుతాను. నా అనుభవాలను నీకు వివరిస్తాను. 18 జ్ఞానులు తమ పూర్వీకుల ద్వారా నేర్చుకుని, ఏమీ దాచుకోకుండా చెప్పిన ఉపదేశాలు నీకు చెబుతాను. 19 జ్ఞానులకే ఆ దేశం వారసత్వంగా ఇవ్వబడింది. అన్యజనులు ఎవ్వరూ ఆ దేశంలో లేరు. ఆ జ్ఞానులు బోధించినది నీకు తెలియజేస్తాను. 20 దుర్మార్గుడు తాను బ్రతికినంత కాలం వేదనలు అనుభవిస్తాడు. దుర్మార్గం చేసే వాళ్ళకు నియమించిన సంవత్సరాలన్నిటిలో బాధలు తప్పవు. 21 అతడి చెవుల్లో భయంకరమైన శబ్దాలు మారుమ్రోగుతాయి. అతడు క్షేమంగా ఉన్న సమయంలో కీడు చేసేవాడు అతని మీద పడతాడు. 22 చీకటిలోనుండి తాను తిరిగి రాగలనన్న నమ్మకం అతనికి ఉండదు. వాడు కత్తివాతకు గురి అవుతాడు. 23 ‘ఆహారం ఎక్కడ దొరుకుతుంది?’ అనుకుంటూ దాని కోసం తిరుగుతూ ఉంటాడు. చీకటి రోజులు దాపురించాయని వాడికి తెలుసు. 24 యుద్ధం చేయడానికి సన్నద్ధుడై వచ్చిన రాజు శత్రువుని పట్టుకుని బంధించినట్టు బాధ, వేదన అతణ్ణి పట్టుకుని భయకంపితుణ్ణి చేస్తాయి. 25 వాడు దేవునికి విరోధంగా చెయ్యి చాపుతున్నాడు. సర్వశక్తుడైన దేవుణ్ణి ధిక్కరించి మాట్లాడుతున్నాడు. 26 మెడ వంచని వైఖరితో మూర్ఖత్వంగా తన దిట్టమైన డాలుతో ఆయన మీదికి దండెత్తుతాడు. 27 అతని ముఖమంతా కొవ్వు పేరుకుపోయింది. నడుం చుట్టూ కొవ్వు పెరిగిపోయింది. 28 అలాంటివాడు పాడైపోయిన పట్టణాల్లో నివసిస్తాడు. ఎవ్వరూ నివసించలేని ఇళ్ళలో, శిథిలం కాబోతున్న ఇళ్ళలో నివసిస్తాడు. 29 కాబట్టి వాడు ఎప్పటికీ భాగ్యవంతుడు కాలేకపోతాడు. అతడి ధనం నిలబడదు. అతడి పంటల పైరు బరువెక్కి నేలను తాకేలా కిందకు వంగదు. 30 అతడు చీకటి నుండి తప్పించుకోలేడు. అగ్నిజ్వాలలు వాడి లేత కొమ్మలను దహించివేస్తాయి. దేవుని నోటి నుండి వచ్చిన ఊపిరి వాణ్ణి నాశనం చేస్తుంది. 31 వాడు వ్యర్ధమైన వాటిని నమ్ముకోకుండా ఉండు గాక. వాడు మోసపోయినవాడు. వాడికి దక్కే ప్రతిఫలం శూన్యం. 32 వాడి ఆయుష్షు తీరకముందే ముసలివాడు అయిపోతాడు. వాడు ఎండిపోయిన కొమ్మలాగా వాడిపోతాడు. 33 పిందెలు రాలిపోయిన ద్రాక్షచెట్టులాగా, పువ్వులు రాలిపోయిన ఒలీవచెట్టులాగా ఆయన వారిని చేస్తాడు. 34 దైవభక్తి లేని భక్తిహీనుల కుటుంబాలు నిర్జీవంగా మారతాయి. లంచగొండుల నివాసాలు అగ్నికి ఆహుతి అవుతాయి. 35 వాళ్ళ కడుపులో ఉన్న కపటాన్ని వాళ్ళు బయటకు వెళ్ళగక్కుతారు. వాళ్ళ అంతరంగంలో వంచన నివసిస్తుంది.”

Turn reading into real study

Sign up to bookmark verses, take notes, and study with AI-powered tools.

Choose your next step after this chapter Keep reading, choose a plan, or keep studying with AI.
Follow the themes this chapter opens Related topic hubs for the larger questions this chapter may have opened.