Isaiah 65

Start this chapter with AI

Ask AI

Stay in the text and ask about the movement, tension, background, and what this chapter reveals inside the larger book.

1 “నా విషయం అడగని వారిని నా దగ్గరికి రానిచ్చాను. నన్ను వెదకని వారికి నేను దొరికాను. నన్ను పిలవని రాజ్యంతో ‘నేనున్నాను, ఇదిగో నేనున్నాను’ అన్నాను. 2 మూర్ఖంగా ఉండే ప్రజలకోసం రోజంతా నా చేతులు చాపాను. వాళ్ళు తమ ఆలోచనలననుసరిస్తూ చెడు దారిలో నడుస్తూ ఉన్నారు. 3 తోటల్లో బలులు అర్పిస్తూ ఇటుకల మీద ధూపం వేస్తారు. వాళ్ళు నాకెప్పుడూ కోపం తెప్పిస్తూ ఉండే ప్రజలు. 4 వాళ్ళు సమాధుల్లో కూర్చుంటారు. రాత్రంతా మేల్కొని ఉంటారు. తినకూడని మాంసం పులుసుతో, వాళ్ళ పాత్రల్లో పందిమాంసం తింటారు. 5 ‘మా దగ్గరికి రావద్దు, దూరంగా ఉండు. నీకంటే నేను పవిత్రుణ్ణి.’ అని వాళ్ళంటారు. వీళ్ళంతా నా ముక్కుల్లో పొగలాగా రోజంతా మండే నిప్పులాగా ఉన్నారు. 6 యెహోవా ఇలా చెబుతున్నాడు. ఇది నా ఎదుట గ్రంథంలో రాసి ఉంది. నేను ఊరుకోను. ప్రతీకారం చేస్తాను. తప్పకుండా వీళ్ళను నేను శిక్షిస్తాను. 7 వాళ్ళ పాపాలకూ వాళ్ళ పూర్వీకుల పాపాలకూ వారిని శిక్షిస్తాను. పర్వతాలమీద ఈ ప్రజలు ధూపం వేసిన దాన్ని బట్టి, కొండలపై నన్ను దూషించిన దాన్ని బట్టి, మునుపు చేసిన పనులకు కూడా వారి ఒడిలోనే వారికి ప్రతీకారం కొలిచి పోస్తాను.” 8 యెహోవా ఇలా చెబుతున్నాడు. “ద్రాక్షగెలలో కొత్త రసం ఇంకా కనబడితే ప్రజలు, ‘దానిలో మంచి రసం ఉంది. దాన్ని నష్టం చేయవద్దు.’ అంటారు. నా సేవకుల కోసం అలాగే చేస్తాను. నేను వాళ్లందరినీ నాశనం చేయను. 9 యాకోబు వంశంలో సంతానాన్ని పుట్టిస్తాను. యూదాలో నా పర్వతాలను స్వాధీనం చేసుకునే వారిని పుట్టిస్తాను. నేను ఏర్పరచుకున్న వాళ్ళు దాన్ని స్వతంత్రించుకుంటారు. నా సేవకులు అక్కడ నివసిస్తారు. 10 నన్ను వెతికిన నా ప్రజల కోసం షారోను గొర్రెల మేతభూమి అవుతుంది. ఆకోరు లోయ, పశువులకు విశ్రాంతి స్థలంగా ఉంటుంది. 11 అయితే యెహోవాను వదిలేసి, నా పవిత్ర పర్వతాన్ని విస్మరించి, అదృష్టదేవుడికి బల్ల సిద్ధపరచి, విధి దేవుడికి పానీయార్పణం అర్పిస్తున్నారు. 12 నేను పిలిచినప్పుడు మీరు జవాబివ్వలేదు. నేను మాట్లాడినప్పుడు మీరు వినలేదు. దానికి బదులు నా దృష్టికి చెడ్డగా ప్రవర్తించారు. నాకిష్టం లేని వాటిని కోరుకున్నారు. కాబట్టి నేను కత్తిని మీకు విధిగా నియమిస్తాను. మీరంతా వధకు లోనవుతారు.” 13 యెహోవా ప్రభువు ఇలా చెబుతున్నాడు. “వినండి. నా సేవకులు భోజనం చేస్తారు గానీ మీరు ఆకలిగొంటారు. నా సేవకులు పానం చేస్తారు గానీ మీరు దప్పిగొంటారు. నా సేవకులు సంతోషిస్తారు గానీ మీరు సిగ్గుపాలవుతారు. 14 నా సేవకులు గుండె నిండా ఆనందంతో కేకలు వేస్తారు గానీ మీరు గుండె బరువుతో ఏడుస్తారు. మనోవేదనతో రోదిస్తారు. 15 నేను ఎన్నుకున్న వారికి మీ పేరు శాపవచనంగా విడిచిపోతారు. నేను, యెహోవాను, మిమ్మల్ని హతం చేస్తాను. నా సేవకులను వేరే పేరుతో పిలుస్తాను. 16 ప్రపంచానికి దీవెన ప్రకటించేవాణ్ణి, సత్యమై ఉన్న నేనే దీవిస్తాను. భూమి మీద ప్రమాణం చేసేవాడు సత్యమై ఉన్న దేవుడినైన నా తోడని ప్రమాణం చేస్తాడు. ఎందుకంటే మునుపు ఉన్న కష్టాలను మర్చిపోతాడు. అవి నా కంటికి కనబడకుండా పోతాయి. 17 ఇదిగో నేను కొత్త ఆకాశాన్నీ కొత్త భూమినీ సృష్టించబోతున్నాను. గత విషయాలు మనసులో పెట్టుకోను. గుర్తుపెట్టుకోను. 18 అయితే, నేను సృష్టించబోయే వాటి కారణంగా ఎప్పటికీ సంతోషించండి. నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలంగా ఆమె ప్రజలను సంతోషకారణంగా సృష్టించబోతున్నాను. 19 నేను యెరూషలేము గురించి ఆనందిస్తాను. నా ప్రజలను గురించి ఆనందిస్తాను. ఏడుపు, రోదన దానిలో ఇక వినబడవు. 20 కొద్దిరోజులే బతికే పసికందులు ఇక ఎన్నడూ అక్కడ ఉండరు. ముసలివారు కాలం నిండకుండా చనిపోరు. నూరేళ్ళ వయసులో చనిపోయేవారిని యువకులు అంటారు. నూరేళ్ళ వయసు ముందే చనిపోయే పాపిని శాపానికి గురి అయినవాడుగా ఎంచుతారు. 21 ప్రజలు ఇళ్ళు కట్టుకుని వాటిలో కాపురముంటారు. ద్రాక్షతోటలు నాటించుకుని వాటి పండ్లు తింటారు. 22 వారు కట్టుకున్న ఇళ్ళల్లో వేరేవాళ్ళు కాపురముండరు. వారు నాటిన వాటిని ఇతరులు తినరు. నా ప్రజల ఆయువు వృక్షాల ఆయువంత ఉంటుంది. నేను ఎన్నుకున్నవారు తాము చేతులతో చేసిన వాటిని చాలాకాలం ఉపయోగించుకుంటారు. 23 వారు వృథాగా ప్రయాసపడరు. దిగులు తెచ్చుకుని పిల్లలను కనరు. వారు యెహోవా దీవించే ప్రజలుగా ఉంటారు. వారి సంతానం కూడా అలాగే ఉంటారు. 24 వాళ్ళు పిలవక ముందే నేను వారికి జవాబిస్తాను. వాళ్ళు ఇంకా మాట్లాడుతూ ఉండగానే నేను వింటాను. 25 తోడేళ్లు గొర్రెపిల్లలు కలిసి మేస్తాయి. సింహం ఎద్దులాగా గడ్డి తింటుంది. పాము మట్టి తింటుంది. నా పవిత్ర పర్వతమంతట్లో అవి హాని చేయవు. నాశనం చేయవు” అని యెహోవా చెబుతున్నాడు.

Turn reading into real study

Sign up to bookmark verses, take notes, and study with AI-powered tools.

Choose your next step after this chapter Keep reading, choose a plan, or keep studying with AI.
Follow the themes this chapter opens Related topic hubs for the larger questions this chapter may have opened.