Hebrews 10

Start this chapter with AI

Ask AI

Stay in the text and ask about the movement, tension, background, and what this chapter reveals inside the larger book.

1 ఎందుకంటే ధర్మశాస్త్రం అనేది భవిష్యత్తులో కలిగే శ్రేష్ఠమైన విషయాలకు ప్రతిబింబంలా ఉంది కానీ అది వాటి నిజ స్వరూపం కాదు. యాజకులు ప్రతి సంవత్సరం అర్పించే ఒకే రకం బలుల ద్వారా ధర్మశాస్త్రం దేవుని దగ్గరికి వచ్చే వారిని పరిపూర్ణులను చేయలేదు. 2 ఒకవేళ అలా చేయగలిగితే ఇక ఆ బలులు అర్పించడం మానేస్తారు కదా! ఆరాధించేవారు ఒక సారంటూ శుద్ధులైతే పాపానికి గూర్చిన స్పృహ వారికిక ఉండదు కదా! 3 అయితే ఆ బలులు అర్పించడం వల్ల ప్రతి సంవత్సరం పాపాలు గుర్తుకు వస్తూనే ఉంటాయి. 4 ఎందుకంటే ఎద్దుల, మేకల రక్తం పాపాన్ని తీసివేయడం అసాధ్యం. 5 క్రీస్తు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఇలా అన్నాడు, “నువ్వు బలులను గానీ కానుకలను గానీ కోరుకోలేదు. కానీ నాకొక దేహాన్ని నువ్వు సిద్ధం చేసావు. 6 దహన బలులన్నా పాప పరిహారం కోసం చేసే బలులన్నా నీకు సంతోషం ఉండదు. 7 అప్పుడు నేను నీతో ఇలా అన్నాను, ‘చూడు, నా గురించి గ్రంథంలో రాసిన ప్రకారం నీ ఇష్టాన్ని జరిగించడానికి నేనున్నాను.’” 8 పైన చెప్పినట్టుగా ఆయన, “నువ్వు బలులను గానీ, కానుకలను గానీ దహన బలులను గానీ పాప పరిహారం కోసం చేసే బలులను గానీ కోరుకోవు, వీటిలో నీకు సంతోషం ఉండదు. ఇవి ధర్మశాస్త్రం ప్రకారం అర్పించబడేవి” అన్నాడు. 9 ఆ తరువాత ఆయన, “చూడు, నీ ఇష్ట ప్రకారం చేయడానికి నేనున్నాను” అని చెప్పాడు. రెండవ ప్రక్రియను నెలకొల్పడానికి ఆయన మొదటి ప్రక్రియను పక్కన పెట్టేశాడు. 10 ఈ రెండవ ప్రక్రియలో యేసు క్రీస్తు దేహం ఒక్కసారే బలి కావడం చేత దేవుని ఇష్ట ప్రకారం మనకు శుద్ధి జరిగింది. 11 నిజంగా ప్రతి యాజకుడూ ప్రతి రోజూ నిలబడి ఒకే విధమైన బలులు అదేపనిగా అర్పిస్తూ సేవ చేస్తూ ఉంటాడు. అవి ఎప్పటికీ పాపాలను తీసివేయలేవు. 12 కానీ క్రీస్తు పాపాల కోసం శాశ్వతంగా నిలిచి ఉండే ఒకే బలి అర్పించి దేవుని కుడి పక్కన కూర్చుని ఉన్నాడు. 13 తన శత్రువులు అవమానం పొంది తన కాళ్ళ కింద పీటగా మారే సమయం కోసం వేచి చూస్తూ ఉన్నాడు. 14 శుద్ధి పొందిన వారిని ఆయన ఒక్క బలి ద్వారా శాశ్వతంగా పరిపూర్ణులుగా చేశాడు. 15 దీన్ని గురించి పరిశుద్ధాత్మ కూడా మనకు సాక్షమిస్తున్నాడు. మొదట ఆయన ఇలా అన్నాడు, 16 “‘ఆ రోజులు గడిచిన తరువాత నేను వారితో చేసే ఒప్పందం ఇదే’ అని ప్రభువు అంటున్నాడు. ‘నా శాసనాలను వారి హృదయాల్లో ఉంచుతాను. వారి మనసులపై వాటిని రాస్తాను.’” 17 తరువాత ఆయన, “వాళ్ళ పాపాలనూ అక్రమాలనూ ఇక మీదట ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోను” అన్నాడు. 18 ఈ విషయాలకు ఎప్పుడు క్షమాపణ కలుగుతుందో ఇక అప్పటి నుండి పాప పరిహారం కోసం చేసే బలులు ఉండవు. 19 కాబట్టి సోదరులారా, యేసు రక్తం ద్వారా అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించడానికి మనకు ధైర్యం ఉంది. 20 తెర గుండా అంటే తన దేహం ద్వారా ప్రవేశించే కొత్తదీ, సజీవమూ అయిన మార్గాన్ని ఆయన మనకోసం తెరిచాడు. 21 దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుక, 22 విశ్వాసం విషయంలో సంపూర్ణ నిశ్చయత ఉన్న యథార్ధ హృదయంతో, కల్మషమైన మనస్సాక్షి నుండి శుద్ధి అయిన హృదయంతో, స్వచ్ఛమైన నీటితో కడిగిన శరీరంతో దేవుణ్ణి సమీపిద్దాం. 23 వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు కాబట్టి చలించకుండా మనకు కలిగిన ఆశాభావం గూర్చిన మన ఒప్పుకోలుకు కట్టుబడి ఉందాం. 24 అధికంగా ప్రేమించడానికీ, మంచి పనులు చేయడానికీ ఒకరినొకరు ప్రేరేపించుకుంటూ ఉండండి. 25 కొంత మంది సమాజంగా సమకూడడం మానేశారు. మీరు అలా చేయవద్దు. ఆ దినం దగ్గర పడడం చూసే కొద్దీ ఇంకా ఎక్కువగా అలా చేస్తూ ఉండండి. 26 సత్యాన్ని గూర్చిన జ్ఞానం స్వీకరించిన తరువాత కూడా మనం ఉద్దేశపూర్వకంగా పాపం చేస్తే ఆ పాపాలకు ఇక బలులేమీ ఉండవు. 27 కానీ భయంతో తీర్పు కోసం ఎదురు చూడటమే మిగిలి ఉంటుంది. అలాగే దేవుని శత్రువులను దహించి వేసే ప్రచండమైన అగ్ని ఉంటుంది. 28 ఎవడైనా మోషే ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని తిరస్కరిస్తే ఇద్దరో ముగ్గురో చెప్పిన సాక్ష్యం మీద వాడిని ఎలాంటి దయాదాక్షిణ్యం లేకుండా చంపుతారు. 29 ఇలా ఉంటే మరి దేవుని కుమారుణ్ణి తమ కాళ్ళ కింద తొక్కివేసి, తనను శుద్ధి చేసిన నిబంధన రక్తాన్ని అపవిత్రమైనదిగా ఎంచి, కృపాభరితమైన ఆత్మను అవమానించిన వాడికి మరి ఇంకెంత ఎక్కువ శిక్ష పడుతుందో ఆలోచించండి. 30 “ప్రతీకారం తీర్చడం నా పని. నేనే తిరిగి చెల్లిస్తాను” అనీ, అలాగే “ప్రభువు తన ప్రజలకు తీర్పు తీరుస్తాడు” అనీ చెప్పిన వాడు మనకు తెలుసు. 31 సజీవుడైన దేవుని చేతిలో పడడం భయానకమైన విషయం. 32 అయితే గతించిన రోజులను జ్ఞాపకం చేసుకోండి. మీరు వెలుగును అనుభవించిన తరువాత ఎంత గొప్ప హింసనూ వేదననూ భరించారో జ్ఞాపకం చేసుకోండి. 33 హింసల, అవమానాల వల్ల మీరు బహిరంగంగా అపహాస్యానికి గురయ్యారు. మరో వైపు అలాంటి వేదన అనుభవించిన వారితో మీరు భాగస్వాములయ్యారు. 34 ఇదెలాగంటే, మీరు ఖైదులో ఉన్నవారిని కనికరించారు. మీకు శ్రేష్ఠమైన, కలకాలం నిలిచి ఉండే సంపదలు ఉన్నాయని తెలుసుకుని మీకున్న ఆస్తిపాస్తులను ఇతరులు పట్టుకు పోతుంటే ఆనందంగా అంగీకరించారు. 35 కాబట్టి ధైర్యం కోల్పోవద్దు. ధైర్యంగా ఉంటే గొప్ప బహుమానం ఉంటుంది. 36 దేవుని ఇష్టాన్ని జరిగించిన తరువాత, ఆయన వాగ్దానం చేసిన వాటిని పొందడానికి మీకు సహనం కావాలి. 37 “ఇక కొద్ది కాలం తరువాత రానున్న వాడు తప్పకుండా వస్తాడు. ఆయన ఆలస్యం చేయడు. 38 నా నీతిమంతుడు విశ్వాసం వల్లనే జీవిస్తాడు. అతడు వెనక్కు మళ్ళితే అతణ్ణి గూర్చి నేను సంతోషించను.” 39 అయితే మనం నాశనానికి పోవడానికి వెనక్కు తీసేవారం కాము. కానీ ఆత్మను కాపాడుకోడానికి కావలసిన విశ్వాసం గలవారిలో మనం ఉన్నాం.

Turn reading into real study

Sign up to bookmark verses, take notes, and study with AI-powered tools.

Choose your next step after this chapter Keep reading, choose a plan, or keep studying with AI.
Follow the themes this chapter opens Related topic hubs for the larger questions this chapter may have opened.