Deuteronomy 3

Start this chapter with AI

Ask AI

Stay in the text and ask about the movement, tension, background, and what this chapter reveals inside the larger book.

1 మనం తిరిగి బాషాను దారిలో వెళ్తుండగా బాషాను రాజు ఓగు, అతని ప్రజలంతా ఎద్రెయీలో మనతో యుద్ధం చేయడానికి ఎదురుగా వచ్చారు. 2 యెహోవా నాతో ఇలా అన్నాడు. “అతనికి భయపడ వద్దు. అతన్నీ అతని ప్రజలనూ అతని దేశాన్నీ నీ చేతికి అప్పగించాను. హెష్బోనులో అమోరీయుల రాజు సీహోనుకు చేసినట్టే ఇతనికి కూడా చేయాలి.” 3 ఆ విధంగా మన దేవుడు యెహోవా బాషాను రాజు ఓగును, అతని ప్రజలందరినీ మన చేతికి అప్పగించాడు. అతనికి ఎవ్వరూ మిగలకుండా అందరినీ హతం చేశాం. 4 ఆ కాలంలో అతని పట్టణాలన్నీ స్వాధీనం చేసుకున్నాం. మన స్వాధీనంలోకి రాని పట్టణం ఒక్కటీ లేదు. బాషానులో ఓగు రాజ్యం అర్గోబు ప్రాంతంలో ఉన్న 60 పట్టణాలు ఆక్రమించుకున్నాం. 5 ఆ పట్టణాలన్నీ గొప్ప ప్రాకారాలు, ద్వారాలు, గడియలతో ఉన్న దుర్గాలు. అవిగాక ప్రాకారాలు లేని ఇంకా చాలా పట్టణాలు స్వాధీనం చేసుకున్నాం. 6 మనం హెష్బోను రాజు సీహోనుకు చేసినట్టు వాటిని నిర్మూలం చేశాం. ప్రతి పట్టణంలోని స్త్రీ పురుషులనూ పిల్లలనూ నాశనం చేశాం. 7 వారి పశువులనూ ఆ పట్టణాల ఆస్తినీ దోచుకున్నాం. 8 ఆ కాలంలో అర్నోను లోయ నుండి హెర్మోను కొండ వరకూ, యొర్దాను అవతల ఉన్న దేశాన్ని ఇద్దరు అమోరీయుల రాజుల దగ్గర నుండి స్వాధీనం చేసుకున్నాం. 9 సీదోనీయులు హెర్మోనును “షిర్యోను” అనేవారు. అమోరీయులు దాన్ని “శెనీరు” అనేవారు. 10 మైదానంలోని పట్టాణాలన్నిటిని, బాషానులోని ఓగు రాజ్య పట్టణాలైన సల్కా, ఎద్రెయీ అనేవాటి వరకూ గిలాదు అంతటినీ బాషానునూ ఆక్రమించాం. 11 రెఫాయీయులలో బాషాను రాజు ఓగు మాత్రం మిగిలాడు. అతనిది ఇనుప మంచం. అది అమ్మోనీయుల రబ్బాలో ఉంది గదా? దాని పొడవు తొమ్మిది మూరలు, వెడల్పు నాలుగు మూరలు. 12 అర్నోను లోయలో ఉన్న అరోయేరు పట్టణం నుండి గిలాదు కొండ ప్రాంతంలో సగమూ మనం అప్పుడు స్వాధీనం చేసుకొన్న దేశమూ దాని పట్టణాలూ రూబేనీయులకు, గాదీయులకు ఇచ్చాను. 13 ఓగు రాజుకు చెందిన బాషాను అంతటినీ, గిలాదులో మిగిలిన రెఫాయీయుల దేశమని పిలిచే బాషానునూ, అర్గోబు ప్రాంతమంతా మనష్షే అర్థ గోత్రానికి ఇచ్చాను. 14 మనష్షే కొడుకు యాయీరు గెషూరీయుల, మాయాకాతీయుల సరిహద్దుల వరకూ అర్గోబు ప్రాంతాన్ని పట్టుకుని, తన పేరును బట్టి వాటికి యాయీరు బాషాను గ్రామాలు అని పేరు పెట్టాడు. ఈ రోజు వరకూ వాటి పేరు అదే. 15 మాకీరీయులకు గిలాదును ఇచ్చాను. 16 గిలాదు నుండి అర్నోను లోయ మధ్య వరకూ, యబ్బోకు నది వరకూ, అమ్మోనీయుల పడమటి సరిహద్దు వరకూ రూబేనీయులకూ గాదీయులకూ ఇచ్చాను. 17 ఇవి కాక, కిన్నెరెతు నుండి తూర్పున పిస్గా కొండ వాలుల కింద, ఉప్పు సముద్రం అని పిలిచే అరాబా సముద్రం దాకా వ్యాపించిన అరాబా ప్రాంతాన్ని, యొర్దాను లోయ మధ్యభూమిని, రూబేనీయులకూ గాదీయులకూ ఇచ్చాను. 18 అప్పుడు నేను మీతో “మీరు స్వాధీనం చేసుకోడానికి మీ దేవుడు యెహోవా ఈ దేశాన్ని మీకిచ్చాడు. మీలో యుద్ధవీరులంతా సిద్ధపడి మీ సోదరులైన ఇశ్రాయేలు ప్రజలతో కలిసి నది దాటి రావాలి. 19 యెహోవా మీకు విశ్రాంతినిచ్చినట్టు మీ సోదరులకు కూడా విశ్రాంతినిచ్చే వరకూ నేను మీకిచ్చిన పట్టణాల్లో నివసించాలి. 20 అంటే మీ యెహోవా దేవుడు యొర్దాను అవతల వారికి ఇస్తున్న దేశాన్ని వారు స్వాధీనం చేసుకునే వరకూ, మీ భార్యలు, మీ పిల్లలు, మీ మందలు నేను మీకిచ్చిన పట్టణాల్లో నివసించాలి. ఆ తరువాత మీరు మీ స్వాస్థ్యాలకు తిరిగి రావాలి అని మీకు ఆజ్ఞాపించాను. మీ మందలు చాలా ఎక్కువని నాకు తెలుసు” అన్నాను. 21 ఆ సమయంలో నేను యెహోషువకు ఇలా ఆజ్ఞాపించాను. “మీ యెహోవా దేవుడు ఈ ఇద్దరు రాజులకు చేసినదంతా నువ్వు కళ్ళారా చూశావు గదా. నువ్వు వెళ్తున్న రాజ్యాలన్నిటికీ యెహోవా అదే విధంగా చేస్తాడు. 22 మీ యెహోవా దేవుడు మీ పక్షంగా యుద్ధం చేస్తాడు కాబట్టి వారికి భయపడ వద్దు.” 23 ఆ రోజుల్లో నేను “యెహోవా, ప్రభూ, నీ మహిమనూ, నీ బాహుబలాన్నీ నీ దాసునికి చూపించడం ప్రారంభించావు. 24 ఆకాశంలో గాని, భూమిపై గాని నువ్వు చేసే పనులు చేయగల దేవుడెవడు? నీ అంత పరాక్రమం చూపగల దేవుడెవడు? 25 నేను అవతలికి వెళ్లి యొర్దాను అవతల ఉన్న ఈ మంచి దేశాన్ని, ఆ మంచి కొండ ప్రాంతాన్ని, ఆ లెబానోనును చూసేలా అనుగ్రహించు” అని యెహోవాను బతిమాలుకున్నాను. 26 యెహోవా మీ కారణంగా నా మీద కోపపడి నా మనవి వినలేదు. ఆయన నాతో ఇలా అన్నాడు. “చాలు. ఇంక ఈ సంగతిని గూర్చి నాతో మాట్లాడవద్దు. 27 నువ్వు ఈ యొర్దాను దాటకూడదు. అయితే, పిస్గా కొండ ఎక్కి పడమటి వైపు, ఉత్తరం వైపు, దక్షిణం వైపు, తూర్పు వైపు తేరి చూడు. 28 నీకు బదులుగా యెహోషువకు ఆజ్ఞాపించి, అతణ్ణి ప్రోత్సహించి, బలపరచు. అతడు ఈ ప్రజలను నడిపించి, నది దాటి, నువ్వు చూడబోయే దేశాన్ని వారు స్వాధీనపరచుకొనేలా చేస్తాడు.” 29 ఆ సమయంలో మనం బేత్పయోరు ఎదుట ఉన్న లోయలో ఉన్నాం.

Turn reading into real study

Sign up to bookmark verses, take notes, and study with AI-powered tools.

Choose your next step after this chapter Keep reading, choose a plan, or keep studying with AI.
Follow the themes this chapter opens Related topic hubs for the larger questions this chapter may have opened.