2 Samuel 22

Start this chapter with AI

Ask AI

Stay in the text and ask about the movement, tension, background, and what this chapter reveals inside the larger book.

1 యెహోవా తనను సౌలు బారి నుండి, తన శత్రువులందరి నుండి తప్పించిన రోజున దావీదు యెహోవాకు ఈ పాట పాడాడు. అతడిలా ప్రార్థించాడు. 2 యెహోవా నా ఆశ్రయ శిల, నా కోట, నా రక్షకుడు. 3 నా ఆశ్రయ శిల, నేను ఆయన సంరక్షణలో ఉంటాను. నా డాలు, నా రక్షణ కొమ్ము, నా సురక్ష. ఆశ్రయస్థానం. హింస నుండి నన్ను కాపాడేవాడు. 4 స్తుతికి అర్హుడైన యెహోవాకు నేను మొర్రపెట్టాను. నా శత్రువుల చేతిలోనుండి నేను తప్పించుకుంటాను. 5 మృత్యుకెరటాలు నన్ను చుట్టుకున్నాయి. భక్తిహీనుల వరద పొంగు నన్ను ముంచెత్తింది. 6 పాతాళ పాశాలు నన్ను కట్టి వేశాయి. మరణపు ఉచ్చులు నన్ను చిక్కించుకున్నాయి. 7 నా దురవస్థలో నేను యెహోవాకు మొర్ర పెట్టాను. నా దేవునికి విన్నవించుకున్నాను. ఆయన తన ఆలయంలో నా ఆక్రోశం విన్నాడు. నా మొర్ర ఆయన చెవులకు చేరింది. 8 అప్పుడు భూమి కంపించింది. అదిరింది. పరమండలపు పునాదులు వణికాయి. ఆయన కోపానికి అవి కంపించాయి. 9 ఆయన ముక్కుపుటాల్లో నుంచి నుండి పొగ లేచింది. ఆయన నోట నుండి జ్వాలలు వచ్చాయి. అవి నిప్పు కణాలను రగిల్చాయి. 10 ఆకాశాన్ని చీల్చి ఆయన దిగి వచ్చాడు ఆయన పాదాల కింద చిక్కటి చీకటి కమ్మి ఉంది. 11 ఆయన కెరూబును అధిరోహించి వచ్చాడు. గాలి రెక్కల మీద స్వారీ చేస్తూ కనిపించాడు. 12 అంధకారాన్ని తన చుట్టూ గుడారంగా చేసుకున్నాడు. దట్టమైన కారుమబ్బులను ఆకాశంలో రాశి పోశాడు. 13 ఆయన సన్నిధి మెరుపుల్లోనుండి అగ్ని కణాలు కురిశాయి. 14 యెహోవా ఆకాశం నుండి గర్జించాడు. సర్వోన్నతుడు భీకర ధ్వని చేశాడు. 15 తన బాణాలు వేసి శత్రువులను చెదరగొట్టాడు. ఉరుములు కురిపించి వారిని కకావికలు చేశాడు. 16 యెహోవా యుధ్ధ ధ్వనికి ఆయన ముక్కుపుటాల నుండి వెలువడిన సెగకి భూగోళం పునాది రాళ్లు బయట పడ్డాయి. 17 పైనుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకున్నాడు. నురగలు కక్కుతున్న జలరాసుల్లో నుండి నన్ను బయటికి తీశాడు. 18 బలవంతులైన పగవారి నుండి, నన్ను ద్వేషించే వారినిండి, నన్ను లొంగదీసుకునే వారి నుండి ఆయన నన్ను రక్షించాడు. 19 విపత్కర సమయంలో వారు నా మీదికి వచ్చారు. కానీ యెహోవా నాకు అండగా ఉన్నాడు. 20 యెహోవా విశాలమైన చోటికి నన్ను తోడుకుని వచ్చాడు. నేనంటే ఆయనకు ఇష్టం గనక ఆయన నన్ను రక్షించాడు. 21 నా నీతినిబట్టి ఆయన నాకు ప్రతిఫలమిచ్చాడు. నా నిర్దోషత్వాన్ని బట్టి నాకు పూర్వ క్షేమ స్థితి కలిగించాడు. 22 ఎందుకంటే యెహోవా మార్గాలను నేను అనుసరిస్తున్నాను. నా దేవుని నుండి వైదొలగి దుర్మార్గంగా ప్రవర్తించలేదు. 23 ఆయన న్యాయవిధులన్నీ నా కళ్ళెదుటే ఉన్నాయి. ఆయన కట్టడల నుండి ఎప్పుడూ దారి తొలగ లేదు. 24 ఆయన దృష్టికి నిర్దోషిగా ఉన్నాను. పాపానికి దూరంగా ఉన్నాను. 25 నా నీతినిబట్టి యెహోవా నాకు పూర్వ క్షేమస్థితి కలిగించాడు తన దృష్టిలో నా నిర్దోషత్వాన్ని బట్టి నాకు ప్రతిఫలమిచ్చాడు. 26 నమ్మదగిన వారికి నీవు నమ్మదగిన వాడిగా ఉంటావు. యథార్థవంతుల పట్ల నీవు యథార్థవంతుడవుగా ఉంటావు. 27 నిష్కళంకుల యెడల నీవు నిష్కళంకంగా ఉంటావు. వక్ర బుద్ది గలవారి యెడల వికటంగా ఉంటావు. 28 యాతన పడే వారిని రక్షిస్తావు గర్విష్ఠులకు విరోధివై వారిని అణచి వేస్తావు. 29 యెహోవా, నీవు నాకు దీపం. యెహోవా నా చీకటిని వెలుగుగా మార్చు. 30 నీ సహాయంతో నేను అడ్డుకంచెలు అధిగమిస్తాను. నా దేవుని సహాయంతో నేను ప్రాకారాలను దాటుతాను. 31 దేవుని మార్గం పరిపూర్ణం యెహోవా వాక్కు నిర్మలం ఆయన అండజేరిన వారికందరికి ఆయన డాలు. 32 యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది? 33 దేవుడు నాకు బలమైన కోట. ఆయన తన మార్గాల్లో యథార్థవంతులను నడిపిస్తాడు. 34 ఆయన నా కాళ్లు జింకకాళ్లవలె చేస్తాడు. పర్వతాలపై నన్ను నిలుపుతాడు. 35 నా చేతులకు యుద్ధం నేర్పేవాడు ఆయనే నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుబెడతాయి. 36 నీవు నీ రక్షణ డాలును నాకు అందిస్తావు. నీ అనుగ్రహం నన్ను గొప్పచేస్తుంది. 37 నా పాదాల కింద స్థలం విశాలం చేస్తావు. అందువల్ల నా కాళ్ళు జారవు. 38 నా శత్రువులను తరిమి నాశనం చేస్తాను. వారిని నాశనం చేసేదాకా నేను వెనుదిరగను. 39 నేను వారిని మింగి వేశాను. ముక్కలుచెక్కలు చేశాను. వారిక లేవలేరు. వారు నా కాళ్ళ కింద ఉన్నారు. 40 నడికట్టు బిగించి కట్టినట్టు యుద్ధం కోసం నాకు బలాన్ని ధరింపజేస్తావు. నా మీదికి లేచిన వారిని నీవు అణచివేస్తావు. 41 నా శత్రువుల మెడలను నా ముందు వంచావు. నన్ను ద్వేషించే వారిని నేను సమూలనాశనం చేస్తాను. 42 వారు సహాయం కోసం అరిచారు. కానీ రక్షించే వాడు ఎవడూ లేడు. వారు యెహోవా కోసం ఎదురు చూసినా ఆయన వారికి జవాబియ్యడు. 43 నేను నేల దుమ్ము లాగా వారిని పొడి చేస్తాను. వీధిలోని బురదలాగా నేను వారిని వెదజల్లి అణగదొక్కుతాను. 44 నా స్వజనుల కలహాల్లో నుండి కూడా నీవు నన్నువిడిపించావు. ప్రజల అధికారిగా నన్ను నిలిపావు. నేను ఎరుగని ప్రజానీకం నన్ను సేవిస్తారు. 45 పరదేశులు గత్యంతరం లేక నాకు లోబడతారు. వారు నన్నుగూర్చి వింటే చాలు, నాకు విధేయులౌతారు. 46 అన్యులు వణకుతూ తమ భద్రమైన స్థలాలు విడిచి వస్తారు. 47 యెహోవా సజీవుడు. నాకు అండ అయిన వాడికి స్తుతి. నా విముక్తి శిల అయిన దేవుడు ఘనత నొందుగాక. 48 ఆయన నా పక్షంగా ప్రతీకారం చేసే దేవుడు జాతులను నాకు లోబరిచేవాడు ఆయనే. 49 ఆయనే నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిస్తాడు. నా మీద దాడి చేసే వారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చిస్తావు. హింసాత్మకుల నుండి నన్ను కాపాడుతావు. 50 కాబట్టి యెహోవా, జాతుల మధ్య నీకు కృతజ్ఞతలు చెల్లిస్తాను. నీ నామానికి స్తుతి పాడుతాను. 51 తాను నియమించిన రాజుకు ఆయన గొప్ప విజయాన్నిస్తాడు. తాను అభిషేకించిన దావీదుకు అతని సంతానానికి నిబంధన విశ్వసనీయత చూపే వాడు ఆయన.

Turn reading into real study

Sign up to bookmark verses, take notes, and study with AI-powered tools.

Choose your next step after this chapter Keep reading, choose a plan, or keep studying with AI.
Follow the themes this chapter opens Related topic hubs for the larger questions this chapter may have opened.