1 Kings 21

Start this chapter with AI

Ask AI

Stay in the text and ask about the movement, tension, background, and what this chapter reveals inside the larger book.

1 యెజ్రెయేలులో సమరయ రాజు అహాబు భవనాన్ని ఆనుకుని యెజ్రెయేలు వాడు నాబోతుకు ఒక ద్రాక్షతోట ఉంది. 2 అహాబు నాబోతును పిలిపించి “నీ ద్రాక్షతోట నా భవనాన్ని ఆనుకుని ఉంది. కాబట్టి అది నాకివ్వు. దానిలో కూరగాయలు పండించుకుంటాను. దానికి బదులు దాని కంటే మంచి ద్రాక్షతోట నీకిస్తాను. లేకపోతే దాని ఖరీదైనా ఇస్తాను” అన్నాడు. 3 అందుకు నాబోతు “నా పిత్రార్జితాన్ని నీకివ్వడానికి నాకెంత మాత్రం కుదరదు” అన్నాడు. 4 నా పిత్రార్జితాన్ని నీకివ్వనని యెజ్రెయేలు వాడైన నాబోతు తనతో చెప్పినందువల్ల అహాబు విచారంగా కోపంతో తన భవనానికి వెళ్లిపోయాడు. మంచం మీద పడుకుని ఎవరితో మాట్లాడకుండా భోజనం చేయకుండా ఉన్నాడు. 5 అప్పుడు అతని భార్య యెజెబెలు వచ్చి “నీవు విచారంగా భోజనం చేయకుండా ఉన్నావేంటి?” అని అడిగింది. 6 అతడు ఆమెతో ఇలా అన్నాడు. “నీ ద్రాక్షతోటను నాకు అమ్ము. లేకపోతే దానికి బదులు మరొక ద్రాక్షతోట నీకిస్తానని యెజ్రెయేలు వాడైన నాబోతును అడిగాను. అతడు నా ద్రాక్షతోట నీకివ్వను అన్నాడు.” 7 అందుకు యెజెబెలు “నీవు ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలన చేయడం లేదా? లేచి భోజనం చెయ్యి. మనస్సులో సంతోషంగా ఉండు. నేనే యెజ్రెయేలు వాడైన నాబోతు ద్రాక్షతోట నీకిప్పిస్తాను” అంది. 8 ఆమె అహాబు పేర ఉత్తరాలు రాయించి అతని ముద్రతో ముద్రించి, ఆ ఉత్తరాలను నాబోతు నివసిస్తున్న పట్టణ పెద్దలకూ ఇంకా ముఖ్యమైన వారికీ పంపింది. 9 ఆ ఉత్తరాల్లో ఇలా రాయించింది. “ఉపవాస దినం జరగాలని మీరు చాటింపు వేయించి నాబోతును ప్రజల ఎదుట నిలబెట్టండి. 10 నీవు దేవుణ్ణి, రాజునూ దూషించావు, అని అతని మీద సాక్ష్యం చెప్పడానికి ఇద్దరు నిజాయితీ లేని మనుషులను ఏర్పాటు చేయండి. తీర్పు అయిన తరువాత అతన్ని బయటికి తీసికెళ్ళి రాళ్లతో కొట్టి చంపేయండి.” 11 అతని నగర పెద్దలూ పట్టణంలో నివసించే ముఖ్యమైన వారూ యెజెబెలు తమకు పంపిన ఉత్తరాల్లో ఉన్నట్టుగా జరిగించారు. 12 ఉపవాస దినం చాటించి నాబోతును ప్రజల ఎదుట నిలబెట్టారు. 13 అప్పుడు ఇద్దరు నిజాయితీ లేని మనుషులు వచ్చి అతని ఎదుట కూర్చుని “నాబోతు దేవుణ్ణీ రాజునూ దూషించాడు” అని ప్రజల ఎదుట నాబోతు మీద సాక్ష్యం చెప్పారు. వాళ్ళు పట్టణం బయటికి అతన్ని తీసికెళ్లి రాళ్లతో కొట్టి చంపేశారు. 14 నాబోతు రాతి దెబ్బలతో చచ్చిపోయాడని వాళ్ళు యెజెబెలుకు కబురు పంపారు. 15 అది విని యెజెబెలు “నాబోతు బతికి లేడు, చచ్చిపోయాడు. కాబట్టి నీవు లేచి యెజ్రెయేలు వాడైన నాబోతు ఖరీదుకు నీకివ్వనన్న అతని ద్రాక్షతోటను స్వాధీనం చేసుకో” అని అహాబుతో చెప్పింది. 16 నాబోతు చనిపోయాడని అహాబు విని లేచి యెజ్రెయేలు వాడైన నాబోతు ద్రాక్షతోటను స్వాధీన పరచుకోడానికి వెళ్ళాడు. 17 అప్పుడు యెహోవా తిష్బీయుడైన ఏలీయాతో ఇలా చెప్పాడు, 18 “నీవు లేచి సమరయలో ఉన్న ఇశ్రాయేలు రాజైన అహాబును కలుసుకోడానికి బయలు దేరు. అతడు నాబోతు ద్రాక్షతోటలో ఉన్నాడు. అతడు దాన్ని స్వాధీనం చేసుకోడానికి వెళ్ళాడు. 19 నీవు అతనితో ఇలా చెప్పు, యెహోవా చెప్పేదేమిటంటే దీన్ని స్వాధీనం చేసుకోవాలని నీవు నాబోతును చంపించావు గదా! యెహోవా చెప్పేదేమిటంటే ఏ స్థలం లో కుక్కలు నాబోతు రక్తాన్ని నాకాయో ఆ స్థలం లోనే కుక్కలు నీ రక్తాన్ని కూడా నాకుతాయి.” 20 అది విని అహాబు ఏలీయాతో “నా పగవాడా, నేను నీకు దొరికానా?” అన్నాడు. అందుకు ఏలీయా ఇలా అన్నాడు. “యెహోవా దృష్టికి కీడు చేయడానికి నిన్ను నువ్వే అమ్ముకున్నావు. కాబట్టి నీవు నాకు దొరికావు. 21 యెహోవా నీతో ఇలా చెబుతున్నాడు, నేను నీ మీదికి కీడు రప్పిస్తాను. నీ వంశం వారిని నాశనం చేస్తాను. ఇశ్రాయేలు వారిలో బానిస గానీ స్వతంత్రుడు గానీ అహాబు వైపు ఎవరూ లేకుండా పురుషులందరినీ నిర్మూలం చేస్తాను. 22 ఇశ్రాయేలువారు పాపం చేయడానికి నీవు కారకుడివై నాకు కోపం పుట్టించావు. కాబట్టి నెబాతు కొడుకు యరొబాము కుటుంబానికీ అహీయా కొడుకు బయెషా కుటుంబానికీ నేను చేసినట్లు నీ కుటుంబానికీ చేస్తాను. 23 యెజెబెలు గురించి యెహోవా చెప్పేదేమిటంటే యెజ్రెయేలు ప్రాకారం దగ్గర కుక్కలు యెజెబెలును పీక్కుతింటాయి. 24 పట్టణంలో చనిపోయే అహాబు సంబంధులను కుక్కలు తింటాయి. పొలంలో చనిపోయేవారిని రాబందులు తింటాయి” అన్నాడు. 25 తన భార్య యెజెబెలు ప్రేరేపణతో యెహోవా దృష్టిలో కీడు చేయడానికి తన్ను తాను అమ్ముకున్న అహాబులాంటి వాడు ఎవ్వడూ లేడు. 26 ఇశ్రాయేలీయుల దగ్గరనుంచి యెహోవా వెళ్లగొట్టిన అమోరీయులు చేసినట్టు, అతడు విగ్రహాలను పెట్టుకుని చాలా నీచంగా ప్రవర్తించాడు. 27 అహాబు ఆ మాటలు విని తన బట్టలు చించుకుని గోనెపట్ట కట్టుకుని ఉపవాసముండి, గోనెపట్ట మీద పడుకుని చాలా విచారించాడు. 28 యెహోవా తిష్బీ వాడైన ఏలీయాతో ఇలా చెప్పాడు. 29 “అహాబు నా ఎదుట తనను తాను ఎంత తగ్గించుకుంటున్నాడో చూశావా? తనను నా ఎదుట తగ్గించుకుంటున్నాడు కాబట్టి, రాబోయే ఆ కీడును అతని కాలంలో పంపించను. నేనతని కొడుకు రోజుల్లో అతని వంశం మీదికి కీడు రానిస్తాను.”

Turn reading into real study

Sign up to bookmark verses, take notes, and study with AI-powered tools.

Choose your next step after this chapter Keep reading, choose a plan, or keep studying with AI.
Follow the themes this chapter opens Related topic hubs for the larger questions this chapter may have opened.