Numbers 4

Mit KI in dieses Kapitel einsteigen

KI zu diesem Kapitel fragen

Bleib im Text und stelle Fragen zu Verlauf, Spannung, Hintergrund und dem, was dieses Kapitel im größeren Buch aufdeckt.

1 యెహోవా మోషే అహరోనులతో మాట్లాడాడు. ఆయన ఇలా చెప్పాడు. 2 “లేవీ గోత్రం ప్రజల్లోని కహాతు వంశస్తుల్లో పురుషులను వారి తెగల ప్రకారం, వారి పూర్వీకుల కుటుంబాల ప్రకారం లెక్క పెట్టాలి. 3 వారిలో ముప్ఫై ఏళ్ల వయస్సు నుండి యాభై ఏళ్ల వరకూ ఉన్న వారిని లెక్క పెట్టు. వీరు సన్నిధి గుడారంలో సేవలో చేరాలి. 4 సన్నిధి గుడారంలో నా కోసం జరగాల్సిన అతి పరిశుద్ధమైన పరిచర్యలకు కహాతు వంశస్తులు బాధ్యత తీసుకోవాలి. 5 ప్రజలు ప్రయాణానికి సిద్ధమైనప్పుడు అహరోనూ, అతని కుమారులూ గుడారంలోకి వెళ్ళాలి. అక్కడ పరిశుద్ధ స్థలానికీ అతి పరిశుద్ధ స్థలానికీ మధ్యలో ఉన్న అడ్డ తెరలను దించాలి. ఆ తెరలతో నిబంధన శాసనాలున్న మందసం పెట్టెను కప్పాలి. 6 దానిపైన డాల్ఫిన్ చర్మాన్ని కప్పాలి. ఇంకా దానిపైన నీలం రంగు బట్ట పరచాలి. దాన్ని మోసుకు వెళ్ళడానికి పెట్టెకు ఉన్న రింగుల్లో కర్రలు దూర్చాలి. 7 సన్నిధి బల్ల పైన నీలం రంగు బట్టను పరచి దాని పైన గిన్నెలను, గరిటెలను, పాత్రలను, నీళ్ళు పోయడానికి కలశాలను ఉంచాలి. దాని పైన రొట్టె ప్రతినిత్యం ఉండాలి. 8 దాని పైన ఎర్రటి బట్టను పరచాలి. తిరిగి దాని పైన డాల్ఫిన్ చర్మాన్ని కప్పాలి. 9 తరువాత వారు నీలం రంగు బట్టను తీసుకుని దానితో ఏడు దీపాల స్తంభాన్నీ, దాని దీపాలను, కత్తెరనూ కత్తెర పళ్ళాలను, దీపాల్లో పోసే నూనె పాత్రలనూ కప్పాలి. 10 ఏడు దీపాల స్తంభాన్నీ, దానికి సంబంధించిన పరికరాలన్నిటినీ గండుచేప చర్మంలో చుట్టి మోసుకు వెళ్ళడానికి వీలుగా కర్రల పైన ఉంచాలి. 11 తరువాత బంగారు బలిపీఠం పైన నీలం రంగు బట్ట పరచాలి. దాన్ని గండుచేప చర్మంలో చుట్టి దానికున్న రింగుల్లో కర్రలు దూర్చాలి. 12 తరువాత పరిశుద్ధ స్థలంలో సేవకు ఉపయోగించే పరికరాలన్నిటి పైనా నీలం రంగు బట్ట పరచాలి. దాన్ని గండుచేప చర్మంలో చుట్టి మోసుకు వెళ్ళడానికి వీలుగా కర్రల పైన ఉంచాలి. 13 బలిపీఠం పైన బూడిదను తీసివేసి దానిపై ఊదా రంగు బట్ట పరచాలి. 14 బలిపీఠం దగ్గర సేవకై ఉపయోగించే పరికరాలన్నిటినీ మోసుకు వెళ్ళడానికి వీలుగా కర్రలపైన ఉంచాలి. ఈ పరికరాలేవంటే నిప్పు తెచ్చే పాత్రలూ, ముళ్ళ గరిటెలూ, పారలూ, గిన్నెలూ. బలిపీఠాన్ని గండుచేప చర్మంలో చుట్టి మోసుకు వెళ్ళడానికి వీలుగా దానికున్న రింగుల్లో కర్రలు దూర్చాలి. 15 అహరోనూ అతని కొడుకులూ పరిశుద్ధ స్థలాన్నీ, దానికి సంబంధించిన పరికరాలన్నిటినీ సంపూర్ణంగా కప్పిన తరువాత ప్రజలు ప్రయాణం మొదలు పెట్టినప్పుడు కహాతు వంశస్తులు పరిశుద్ధ స్థలాన్ని మోయడానికి ముందుకు రావాలి. అయితే వారు పరిశుద్ధ పరికరాలను ముట్టుకుంటే చనిపోతారు. సన్నిధి గుడారంలోని పరికరాలను మోసుకు వెళ్ళడం కహతు వంశస్తుల బాధ్యత. 16 యాజకుడు అహరోను కొడుకు ఎలియాజరు దీపాల్లో నూనె ఉందో లేదో చూసుకోవాలి. అలాగే అతడు పర్యవేక్షించాల్సిన బాధ్యతలు, పరిమళ సాంబ్రాణి, నైవేద్యం, అభిషేకానికి వాడే నూనె, మొత్తం మందిరం, దానిలోనివన్నీ, పరిశుద్ధ పరికరాలు, వస్తువులు-వీటన్నిటికీ అతడు బాధ్యత వహించాలి.” 17 తరువాత యెహోవా మోషే, అహరోనులతో మాట్లాడాడు. ఆయన ఇలా చెప్పాడు. 18 “మీరు కహాతు తెగ వారిని లేవీ గోత్రం నుండి వేరు కానీయవద్దు. 19 వారు పరిశుద్ధమైన వాటిని సమీపించి చావకుండా వారిని పరిరక్షించండి. 20 వారు పరిశుద్ధ స్థలంలోకి ఒక్క క్షణం కూడా వెళ్ళడానికి వీల్లేదు. అలా వెళ్తే వారు చనిపోతారు. అహరోనూ, అతని కొడుకులూ లోపలికి వెళ్ళాలి. ఆ తరువాత కహాతు వారిలో ఒక్కొక్కరికీ వారు చేయాల్సిన పనినీ, వారి ప్రత్యేక విధులను అప్పగించాలి.” 21 తరువాత యెహోవా మోషే, అహరోనులతో మాట్లాడాడు. ఆయన ఇలా చెప్పాడు. 22 “గెర్షోను వంశస్తులను కూడా వారి తెగల ప్రకారం, వారి పూర్వీకుల కుటుంబాల ప్రకారం లెక్కించండి. 23 వారిల్లో ముప్ఫై ఏళ్ల నుండి యాభై ఏళ్ల వయసున్న వారిని లెక్కించండి. సన్నిధి గుడారంలో సేవ చేయడానికి ఈ వయస్సులో ఉన్న వారినందర్నీ లెక్కపెట్టాలి. 24 గెర్షోను తెగల వారు చేయాల్సిన సేవలూ, వారు మోయాల్సిన బరువులూ ఇవి. 25 వారు సన్నిధి గుడారాన్నీ, మందిరం తెరలను, దాని పైకప్పునూ దాని పైన కప్పి ఉన్న గండుచేప చర్మాన్నీ, సన్నిధి గుడారం ప్రవేశం దగ్గర ఉన్న తెరలనూ మోసుకు వెళ్ళాలి. 26 మందిరానికీ, బలిపీఠానికీ సమీపంగా ఉండే ఆవరణలోని తెరలను, ఆవరణ ద్వారం దగ్గర ఉండే తెరలను వాటి తాళ్లనూ, వాటి సేవకి సంబంధించిన పరికరాలన్నిటినీ వారు మోసుకు వెళ్ళాలి. వీటితో చేయాల్సిన పనులన్నీ వారు చేయాలి. 27 గెర్షోను తెగల ప్రజలు చేయాల్సిన సేవల విషయంలో, వారు మోయాల్సిన బరువుల విషయంలో వారిని అహరోనూ అతడి కొడుకులూ నిర్దేశించాలి. వారి బాధ్యతలను వాళ్లకు మీరు అప్పగించాలి. 28 సన్నిధి గుడారం దగ్గర గెర్షోను తెగల ప్రజలు జరిగించాల్సిన సేవ ఇది. యాజకుడు అహరోను కొడుకు ఈతామారు చేతి కింద వారు తమ సేవ జరిగించాలి. 29 మెరారి వంశస్తులను వారి తెగల ప్రకారం, వారి పూర్వీకుల కుటుంబాల ప్రకారం లెక్కించండి. 30 వారిల్లో ముప్ఫై ఏళ్ల నుండి యాభై ఏళ్ల వయసున్న వారిని లెక్కించండి. సన్నిధి గుడారంలో సేవ చేయడానికి ఈ వయస్సులో ఉన్న వారినందర్నీ లెక్కపెట్టాలి. 31 సన్నిధి గుడారంలో వారు తమ బాధ్యతగా జరిగించాల్సిన సేవలు ఇవి. వారు మందిరం చట్రాన్నీ, దాని అడ్డ కర్రలను, స్తంభాలను, దాని దిమ్మలను చూసుకోవాలి. 32 వీటితో పాటు మందిరం చుట్టూ ఉన్న ఆవరణలోని స్తంభాలను, వాటి దిమ్మలను, మేకులను, వాటి తాళ్లనూ, వాటికి సంబంధించిన సామగ్రినీ జాగ్రత్తగా చూసుకోవాలి. వారు మోసుకు వెళ్ళాల్సిన బరువులను పేర్ల వరుసలో రాసి ఉంచాలి. 33 మెరారి తెగల ప్రజలు సన్నిధి గుడారంలో యాజకుడు అహరోను కొడుకు ఈతామారు చేతికింద చేయాల్సిన సేవ ఇది.” 34 అప్పుడు మోషే, అహరోనూ, సమాజంలోని నాయకులూ కహాతు తెగల ప్రజలను వారి తెగల ప్రకారం, వారి పూర్వీకుల కుటుంబాల ప్రకారం లెక్క పెట్టారు. 35 వారిల్లో ముప్ఫై ఏళ్ళు నుండి యాభై ఏళ్ల వయసున్న వారిని సన్నిధి గుడారంలో సేవ చేయడానికి చేరే వారిందర్నీ లెక్క పెట్టారు. 36 వారి తెగల ప్రకారం 2 750 మంది మగ వారిని లెక్క పెట్టారు. 37 కహాతు తెగల ప్రజల్లో నుండి సన్నిధి గుడారంలో సేవ చేయడానికి మోషే, అహరోనులు వీరిని లెక్కించారు. మోషే ద్వారా యెహోవా పలికిన ఆజ్ఞకు లోబడి వారు ఈ పని చేశారు. 38 గెర్షోను తెగల ప్రజలను వారి తెగల ప్రకారం, వారి పూర్వీకుల కుటుంబాల ప్రకారం లెక్క పెట్టారు. 39 వారిల్లో ముప్ఫై ఏళ్ళు నుండి యాభై ఏళ్ల వయసున్న వారిని, సన్నిధి గుడారంలో సేవ చేయడానికి చేరే వారందర్నీ లెక్క పెట్టారు. 40 వారి తెగల ప్రకారం, వారి పూర్వీకుల కుటుంబాల ప్రకారం 2, 630 మంది పురుషులను లెక్కపెట్టారు. 41 గెర్షోను తెగల ప్రజల్లోనుండి సన్నిధి గుడారంలో సేవ చేయడానికి మోషే, అహరోనులు వీళ్ళను లెక్కించారు. మోషే ద్వారా యెహోవా పలికిన ఆజ్ఞకు లోబడి వారు ఈ పని చేశారు. 42 మెరారి తెగల ప్రజలను వారి తెగల ప్రకారం, వారి పూర్వీకుల కుటుంబాల ప్రకారం లెక్క పెట్టారు. 43 వారిల్లో ముప్ఫై ఏళ్ళు నుండి యాభై ఏళ్ల వయసున్న వారిని, సన్నిధి గుడారంలో సేవ చేయడానికి చేరే వారిందర్నీ లెక్క పెట్టారు. 44 వారి తెగల ప్రకారం, వారి పూర్వీకుల కుటుంబాల ప్రకారం 3 200 మంది పురుషులను లెక్కపెట్టారు. 45 మెరారి తెగల ప్రజల్లోనుండి సన్నిధి గుడారంలో సేవ చేయడానికి మోషే, అహరోనులు వీరిని లెక్కించారు. మోషే ద్వారా యెహోవా పలికిన ఆజ్ఞకు లోబడి వారు ఈ పని చేశారు. 46 ఈ విధంగా మోషే, అహరోనూ, ఇశ్రాయేలు ప్రజల నాయకులూ లేవీ గోత్రం వారిందర్నీ వారి తెగల ప్రకారం, వారి పూర్వీకుల కుటుంబాల ప్రకారం లెక్క పెట్టారు. 47 వారిల్లో ముప్ఫై ఏళ్ళు నుండి యాభై ఏళ్ల వయసున్న వారిని, మందిరంలో సేవ చేయడానికి చేరే వారిందర్నీ, సన్నిధి గుడారంలో బరువులు మోసే వారిని లెక్కించారు. 48 అలా మొత్తం 8, 580 మంది మగ వారిని లెక్క పెట్టారు. 49 యెహోవా ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం మోషే వారిని లెక్కించాడు. వారిలో ప్రతి ఒక్కడూ తాను చేసే సేవల ప్రకారం, మోసే బరువుల ప్రకారం నమోదయ్యారు. ఈ విధంగా మోషే ద్వారా యెహోవా పలికిన ఆజ్ఞకు విధేయత చూపారు.

Mach aus Lesen echtes Bibelstudium

Registriere dich, um Verse zu speichern, Notizen zu machen und mit KI-gestützten Werkzeugen zu studieren.

Nächste Schritte nach diesem Kapitel Weiterlesen, Plan wählen oder mit KI weiterarbeiten.
Folge den Themen, die dieses Kapitel öffnet Verwandte Themenhubs, wenn dieses Kapitel eine größere Frage geöffnet hat.