Numbers 31

Mit KI in dieses Kapitel einsteigen

KI zu diesem Kapitel fragen

Bleib im Text und stelle Fragen zu Verlauf, Spannung, Hintergrund und dem, was dieses Kapitel im größeren Buch aufdeckt.

1 యెహోవా “మిద్యానీయులు ఇశ్రాయేలీయులకు చేసిన దానికి ప్రతీకారం తీర్చుకోండి. 2 ఆ తరవాత నీవు చనిపోయి నీ పూర్వీకుల దగ్గరికి చేరుకుంటావు” అని మోషేకు చెప్పాడు. 3 అప్పుడు మోషే “మీలో కొందరు యుద్ధానికి సిద్ధపడి మిద్యానీయుల మీదికి పోయి వారికి యెహోవా విధించిన ప్రతిదండన చేయండి. 4 ఇశ్రాయేలీయుల ప్రతి గోత్రం నుండి వెయ్యిమంది చొప్పున యుద్ధానికి పంపండి” అని ప్రజలతో అన్నాడు. 5 ఆ విధంగా గోత్రానికి వెయ్యి మంది చొప్పున, ఇశ్రాయేలీయుల మొత్తం సైన్యంలో నుండి పన్నెండు వేల మంది యుద్ధ వీరులను సిద్ధం చేశారు. 6 మోషే వారిని, యాజకుడైన ఎలియాజరు కుమారుడు ఫీనెహాసుతో పంపించాడు. అతనికి పరిశుద్ధమైన కొన్ని వస్తువులు, యుద్ధంలో ఊదటానికి బాకాలు పంపాడు. 7 యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టే ఇశ్రాయేలీయులు మిద్యానీయులతో యుద్ధం చేసి మగవారందరినీ చంపేశారు. 8 వారు కాక మిద్యాను రాజులు, ఎవీ, రేకెము, సూరు, హూరు, రేబ అనే ఐదుగుర్ని చంపారు. బెయోరు కొడుకు బిలామును కత్తితో చంపేశారు. 9 వారు మిద్యాను స్త్రీలను, వారి చిన్నపిల్లలను చెరపట్టుకుని, వారి పశువులు, గొర్రెలు, మేకలు అన్నిటిని, వారి సమస్తాన్ని దోచుకున్నారు. 10 వారి పట్టణాలు, కోటలు అన్నిటిని తగలబెట్టారు. 11 వారు మనుషులను గాని పశువులను గాని మిద్యానీయుల ఆస్తి అంతటినీ కొల్లగొట్టారు. 12 తరువాత వారు దానంతటినీ, చెరపట్టిన వారిని మోయాబు మైదానాల్లో యెరికో దగ్గర యొర్దాను పక్కన విడిది చేసి ఉన్న మోషే, యాజకుడు ఎలియాజరు దగ్గరికి, ఇశ్రాయేలీయుల సమాజం దగ్గరికి తీసుకు వచ్చారు. 13 అప్పుడు మోషే, యాజకుడు ఎలియాజరు, సమాజ నాయకులంతా విడిది బయటికి వారికి ఎదురు వెళ్ళారు. 14 అప్పుడు మోషే యుద్ధం నుండి వచ్చిన సహస్రాధిపతులు, శతాధిపతుల పైన కోపపడ్డాడు. 15 అతడు వారితో “మీరు మిద్యాను స్త్రీలను ఎందుకు బతకనిచ్చారు? 16 బిలాము సలహా ప్రకారం పెయోరు విషయంలో ఇశ్రాయేలు ప్రజలు యెహోవాకు ఎదురు తిరిగేలా చేసింది వారే కదా! అందుచేత యెహోవా మన సమాజంలో తెగులు పుట్టించాడు కదా. 17 కాబట్టి మీరు మగ పిల్లలందరినీ మగవారితో సంబంధం ఉన్న ప్రతి స్త్రీనీ చంపండి. 18 మగవారితో సంబంధం లేని ప్రతి ఆడపిల్లను మీ కోసం బతకనీయండి. 19 మీరు ఏడు రోజులు విడిది బయట ఉండాలి. మీలో మనిషిని చంపిన ప్రతివాడూ, చనిపోయిన వారిని తాకిన ప్రతివాడూ, మీరు, మీరు చెరగా పట్టుకొచ్చిన వారు, మూడో రోజున, ఏడో రోజున మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోవాలి. 20 మీరు మీ వస్త్రాలను, చర్మంతో, మేక వెండ్రుకలతో చేసిన వస్తువులను, చెక్కతో చేసిన వస్తువులను అన్నిటినీ శుద్ధి చేయాలి.” 21 అప్పుడు యాజకుడు ఎలియాజరు యుద్ధానికి వెళ్ళిన సైనికులతో “యెహోవా మోషేకు ఇలా ఆజ్ఞాపించాడు, 22 ‘అగ్నితో చెడిపోని బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, తగరం, సీసం, వీటితో చేసిన వస్తువులన్నిటినీ 23 మంటల్లో వేసి తీయడం ద్వారా శుద్ధి చేయాలి. వాటిని పాపపరిహార జలంతో కూడా శుద్ధి చేయాలి. అగ్నితో చెడిపోయే ప్రతి వస్తువును నీళ్లలో వేసి తీయాలి. 24 ఏడో రోజు మీరు మీ బట్టలు ఉతుక్కొని శుద్ధి అయిన తరవాత విడిదిలోకి రావచ్చు.’” అన్నాడు. 25 యెహోవా మోషేకు ఇంకా ఇలా ఆజ్ఞాపించాడు, 26 “నువ్వూ యాజకుడు ఎలియాజరు సమాజంలోని పూర్వీకుల వంశాల నాయకులు మీరు చెరగా పట్టుకున్న మనుషులను, పశువులను లెక్కబెట్టి రెండు భాగాలు చేయండి. 27 సైన్యంగా యుద్ధానికి వెళ్ళిన వారికి సగం, మిగిలిన సర్వసమాజానికి సగం పంచిపెట్టండి. 28 యుద్ధానికి వెళ్ళిన సైనికులపై యెహోవా కోసం పన్ను వేసి, ఆ మనుషుల్లో, పశువుల్లో, గాడిదల్లో, గొర్రె మేకల్లో ఐదు వందలకు ఒకటి చొప్పున వారి సగభాగంలో నుండి తీసుకుని 29 యెహోవాకు అర్పణగా యాజకుడు ఎలియాజరుకు ఇవ్వాలి. 30 అదే విధంగా మిగిలిన ఇశ్రాయేలీయుల సగంలో నుండి మనుషుల్లో, పశువుల్లో, గాడిదల్లో, గొర్రె మేకల్లో, అన్ని రకాల జంతువుల్లోనుండి 50 కి ఒకటి చొప్పున తీసుకుని యెహోవా మందిరాన్ని కాపాడే లేవీయులకు ఇవ్వాలి.” 31 యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన విధంగా మోషే, యాజకుడు ఎలియాజరు చేశారు. 32 ఆ సైనికులు దోచుకున్నది గాక మిగిలింది 33 6, 75,000 గొర్రెలు లేక మేకలు, 34 72,000 పశువులు, 61,000 గాడిదలు, 35 32,000 మంది మగవారితో సంబంధం లేని స్త్రీలు ఉన్నారు. 36 అందులో సగం యుద్ధానికి వెళ్ళిన వారి వంతు, గొర్రె మేకలు 3, 37, 500. వాటిలో యెహోవాకు చెందిన పన్ను 675. పశువుల్లో సగం 36,000. 37 వాటిలో యెహోవా పన్ను 72. 38 గాడిదల్లో సగం 30, 500. 39 వాటిలో యెహోవా పన్ను 61. 40 మనుషుల్లో సగం 16,000 మంది. వారిలో యెహోవా పన్ను 32 మంది. 41 యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన విధంగా అతడు యెహోవాకు చెందాల్సిన అర్పణను యాజకుడు ఎలియాజరుకు ఇచ్చాడు. 42 మోషే సైనికుల నుండి తీసుకుని ఇశ్రాయేలీయులకు ఇచ్చిన సగంలో నుండి లేవీయులకు ఇచ్చాడు. 43 3, 37, 500 గొర్రె మేకలు, 44 36,000 పశువులు, 30, 500 గాడిదలు, 45 16,000 మంది మనుషులు సమాజానికి రావలసిన సగం. 46 మోషే ఆ సగం నుండి మనుషుల్లో, జంతువుల్లో, 47 50 కి ఒకటి చొప్పున తీసి, యెహోవా తనకు ఆజ్ఞాపించిన విధంగా యెహోవా మందిరాన్ని కాపాడే లేవీయులకు ఇచ్చాడు. 48 అప్పుడు సైన్యంలో వేలమందికి, వందల మందికి అధిపతులు మోషే దగ్గరికి వచ్చి 49 “నీ సేవకులైన మేము మా కింద ఉన్న సైనికులందరినీ లెక్కపెట్టాం. మొత్తానికి ఒక్కడు కూడా తగ్గలేదు. 50 కాబట్టి యెహోవా సన్నిధిలో మా కోసం ప్రాయశ్చిత్తం కలిగేలా మాలో ప్రతి ఒక్కడికి దొరికిన బంగారు నగలు, గొలుసులు, కడియాలు, ఉంగరాలు, పోగులు, పతకాలు యెహోవాకు అర్పణ తెచ్చాం” అని చెప్పారు. 51 మోషే, యాజకుడు ఎలియాజరు ఆ బంగారు నగలను వారి నుండి తీసుకున్నారు. 52 వేలమందికి, వందల మందికి అధిపతులైన నాయకులు యెహోవాకు అర్పించిన బంగారం మొత్తం 16, 750 తులాలు. 53 ఆ సైనికుల్లో ప్రతివాడూ తన మట్టుకు తాను దోపుడు సొమ్ము తెచ్చుకున్నాడు. 54 అప్పుడు మోషే, యాజకుడు ఎలియాజరు వేలమందికి, వందల మందికి అధిపతుల దగ్గర తీసుకున్న బంగారాన్ని ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థంగా ప్రత్యక్ష గుడారంలో ఉంచారు.

Mach aus Lesen echtes Bibelstudium

Registriere dich, um Verse zu speichern, Notizen zu machen und mit KI-gestützten Werkzeugen zu studieren.

Nächste Schritte nach diesem Kapitel Weiterlesen, Plan wählen oder mit KI weiterarbeiten.
Folge den Themen, die dieses Kapitel öffnet Verwandte Themenhubs, wenn dieses Kapitel eine größere Frage geöffnet hat.