Genesis 45

Mit KI in dieses Kapitel einsteigen

KI zu diesem Kapitel fragen

Bleib im Text und stelle Fragen zu Verlauf, Spannung, Hintergrund und dem, was dieses Kapitel im größeren Buch aufdeckt.

1 అప్పుడు యోసేపు తన దగ్గర నిలబడ్డ పరివారం ఎదుట తమాయించుకోలేక “అందరినీ నా దగ్గరనుంచి బయటికి పంపేయండి” అని బిగ్గరగా చెప్పాడు. యోసేపు తన అన్నలకు తనను తాను తెలియజేసుకున్నప్పుడు అతని దగ్గర ఎవరూ లేరు. 2 అతడు పెద్దగా ఏడవగా ఐగుప్తీయులు విన్నారు. ఫరో ఇంటివారు ఆ ఏడుపు విన్నారు. 3 అప్పుడు యోసేపు “నేను యోసేపును. నా తండ్రి ఇంకా బతికే ఉన్నాడా?” అని అడిగినప్పుడు, అతని సోదరులు అతని సమక్షంలో కంగారుపడి అతనికి జవాబు ఇవ్వలేకపోయారు. 4 అప్పుడు యోసేపు “నా దగ్గరికి రండి” అని తన సోదరులతో చెబితే, వారు అతని దగ్గరికి వచ్చారు. అప్పుడతడు “ఐగుప్తుకు వెళ్లిపోయేలా మీరు అమ్మేసిన మీ తమ్ముడు యోసేపును నేనే. 5 అయినా, నన్నిక్కడకు మీరు అమ్మేసినందుకు దుఃఖపడవద్దు. మిమ్మల్ని మీరు నిందించుకోవద్దు. ప్రాణరక్షణ కోసం దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాడు. 6 రెండేళ్ళ నుంచి దేశంలో కరువు ఉంది. ఇంకా ఐదేళ్ళు దున్నడం గానీ పంటకోత గానీ ఉండదు. 7 మిమ్మల్ని రక్షించి, భూమి మీద మిమ్మల్ని శేషంగా నిలపడానికీ ప్రాణాలతో కాపాడడానికీ దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాడు. 8 కాబట్టి నన్ను దేవుడే పంపాడు. మీరు కాదు. ఆయన నన్ను ఫరోకు తండ్రిగా అతని ఇంటివారందరికి ప్రభువుగా ఐగుప్తు దేశమంతటి మీదా అధికారిగా నియమించాడు. 9 మీరు త్వరగా నా తండ్రి దగ్గరికి వెళ్ళి అతనితో ‘నీ కొడుకు యోసేపు ఇలా చెబుతున్నాడు-దేవుడు నన్ను ఐగుప్తు దేశమంతటి మీదా అధిపతిగా నియమించాడు, నా దగ్గరికి రండి. ఆలస్యం చేయవద్దు. 10 నువ్వు గోషెను ప్రాంతంలో నివసిస్తావు. అప్పుడు నువ్వూ నీ పిల్లలూ నీ పిల్లల పిల్లలూ నీ గొర్రెల మందలూ నీ పశువులూ నీకు కలిగిన సమస్తమూ నాకు దగ్గరగా ఉంటాయి. 11 ఇంకా ఐదేళ్ళు కరువు ఉంటుంది, కాబట్టి నీకూ నీ ఇంటి వారికీ నీకు కలిగినదానంతటికీ పేదరికం రాకుండా అక్కడ నిన్ను పోషిస్తాను’ అన్నాడని చెప్పండి. 12 ఇదిగో మీతో మాట్లాడేది నా నోరే అని మీ కళ్ళూ నా తమ్ముడు బెన్యామీను కళ్ళూ చూస్తున్నాయి. 13 ఐగుప్తులో నాకున్న వైభవాన్నీ మీరు చూసిన సమస్తాన్నీ మా నాన్నకు తెలియచేసి త్వరగా మా నాన్నను ఇక్కడికి తీసుకు రండి” అని తన సోదరులతో చెప్పాడు. 14 తన తమ్ముడు బెన్యామీను మెడను కౌగలించుకుని ఏడ్చాడు. బెన్యామీను అతణ్ణి కౌగలించుకుని ఏడ్చాడు. 15 అతడు తన సోదరులందరిని ముద్దు పెట్టుకుని వారిని హత్తుకుని ఏడ్చిన తరువాత అతని సోదరులు అతనితో మాట్లాడారు. 16 “యోసేపు సోదరులు వచ్చారు” అనే సంగతి ఫరో ఇంట్లో వినబడింది. అది ఫరోకు, అతని సేవకులకు చాలా ఇష్టమయింది. 17 అప్పుడు ఫరో యోసేపుతో ఇలా అన్నాడు “నీ సోదరులతో ఇలా చెప్పు, ‘మీరిలా చేయండి. మీ పశువుల మీద బరువులు కట్టి కనాను దేశానికి వెళ్ళి 18 మీ తండ్రినీ మీ ఇంటివారిని వెంట బెట్టుకుని నా దగ్గరికి రండి, ఐగుప్తు దేశంలోని మంచి వస్తువులను మీకిస్తాను. ఈ దేశపు సారాన్ని మీరు అనుభవిస్తారు. 19 మీకు ఆజ్ఞ ఇస్తున్నాను, ఇలా చేయండి. మీ పిల్లల కోసం, మీ భార్యల కోసం ఐగుప్తులో నుండి బండ్లను తీసుకుపోయి మీ తండ్రిని వెంటబెట్టుకుని రండి. 20 ఐగుప్తు దేశమంతటిలో ఉన్న మంచి వస్తువులు మీవే అవుతాయి కాబట్టి మీ సామగ్రిని లక్ష్యపెట్టవద్దు’” అన్నాడు. 21 ఇశ్రాయేలు కుమారులు అలాగే చేశారు. యోసేపు ఫరో మాట ప్రకారం వారికి బండ్లు ఇప్పించాడు. ప్రయాణానికి భోజన పదార్ధాలు ఇప్పించాడు. 22 అతడు వారికి రెండేసి జతల బట్టలు ఇచ్చాడు, బెన్యామీనుకు 300 షెకెల్ ల వెండి, ఐదు జతల బట్టలు ఇచ్చాడు. 23 అతడు తన తండ్రి కోసం వీటిని పంపించాడు, ఐగుప్తులోని శ్రేష్ఠమైన వాటిని మోస్తున్న పది గాడిదలనూ ప్రయాణానికి తన తండ్రి కోసం ఆహారం, ఇతర ధాన్యం, వేర్వేరు తినే సరుకులు మోస్తున్న పది ఆడ గాడిదలనూ పంపించాడు. 24 అప్పుడతడు తన సోదరులను సాగనంపి వారు బయలుదేరుతుంటే “దారిలో పోట్లాడుకోవద్దు” అని వారితో చెప్పాడు. 25 వారు ఐగుప్తునుండి బయలు దేరి కనాను దేశానికి తమ తండ్రి అయిన యాకోబు దగ్గరికి వచ్చి 26 “యోసేపు ఇంకా బతికే ఉన్నాడు. ఐగుప్తు దేశమంతటి మీదా అధిపతిగా ఉన్నాడు” అని అతనికి తెలియచేశారు. అయితే అతడు వారి మాట నమ్మలేక పోయాడు. అతని హృదయం విస్మయం చెందింది. 27 అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నీ అతనితో చెప్పారు. తనను తీసుకు వెళ్ళడానికి యోసేపు పంపిన బండ్లు చూసి, వారి తండ్రి యాకోబు ప్రాణం తెప్పరిల్లింది. 28 అప్పుడు ఇశ్రాయేలు “ఇంతే చాలు. నా కొడుకు యోసేపు బతికే ఉన్నాడు, నేను చావక ముందు వెళ్ళి అతన్ని చూస్తాను” అన్నాడు.

Mach aus Lesen echtes Bibelstudium

Registriere dich, um Verse zu speichern, Notizen zu machen und mit KI-gestützten Werkzeugen zu studieren.

Nächste Schritte nach diesem Kapitel Weiterlesen, Plan wählen oder mit KI weiterarbeiten.
Folge den Themen, die dieses Kapitel öffnet Verwandte Themenhubs, wenn dieses Kapitel eine größere Frage geöffnet hat.